సూర్యాపేటలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట మండలం శస్త్రా స్కూల్, టేకుమట్ల ప్రభుత్వ పాఠశాల, యండ్లపల్లి మాంటిస్కోరి, విజ్ఞాన్ పాఠశాలల్లో విద్యార్థులు ఉత్సహంగా బతుకమ్మ పాటలకు డ్యాన్స్ లు వేస్తూ చక్కనైన వేషదారణలు ధరించి ఆనందం వ్యక్తం చేసారు. బతుకమ్మ ఈ నెల 2న ప్రారంభమై 10న ముగుస్తుంది. ఈ యేడు విస్తారంగా కురిసిన వర్షాలతో ఎటు చూసిన అడవి పూలు అందంగా విరబూసి పలకరిస్తున్నాయి. భక్తుకు భక్తితో బతుకమ్మను పూజించేందుకు పూలన్నీ సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ పూలు అన్ని కూడా ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి సమర్పించే నైవేద్యాలకు అనుగుణంగా బతుకమ్మ పేర్లు కూడా ఉంటాయి.
తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో సంబురంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. ప్రతీ యేటా భాద్రపద అమావాస్య మొదలు ఆశ్వియుజ శుక్ల అష్టమి వరకు తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ తొమ్మిది రోజుల పాటూ రాష్ట్ర వ్యాప్తంగా ఊరూ వాడా ఎక్కడ చూసినా సందడే కనిపిస్తుంది. ఈ తొమ్మిది రోజుల పాటు మహిళలు రోజుకో విధమైన బతుకమ్మను పేర్చి పండుగ సంబరాలు జరుపుకుంటారు. చిన్నా పెద్దా వేడుకలలో పాల్గొంటారు. ముచ్చటగా ముస్తాబై బతుకమ్మలు తయారు చేసి అంతా కలసి ఆడిపాడతారు. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో పండుగ సంబరాలు ముగుస్తాయి. అలిగిన బతుకమ్మ ఒక్క రోజు మినహా మిగతా ఎనిమిది రోజులు వైవిధ్యమైన నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు. తీరోక్క పూలను అందంగా స్తూపం, శంఖం, గోపురం ఆకారంలో అమర్చుకుంటారు. బతుకమ్మను ప్రధానంగా తంగేడు పూలు, గునుగు, గుమ్మడి, మందార, బంతి, చేమంతి, అడవి చామంతి, గోరింట, బీర పువ్వులతో పేరుస్తుంటారు. ఈ ఏడాది బతుకమ్మ పండుగ అక్టోబర్ 2 నుంచి 10 తేదీ వరకు జరుపుకోనున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దైద పాపయ్య, ఉపాధ్యాయులు కోటి రెడ్డి, కిరణ్, సలహా బేగం, మంజుల, వసంత,రాధికా, జయమ్మ, అన్నపూర్ణ, మధ్యాహ్న భోజన సిబ్బంది. తదితరులు హాజరయ్యారు.