సూర్యాపేటలో బిఆర్ఎస్ నాయకులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు : రమేష్ రెడ్డి
సూర్యాపేట జిల్లా కేంద్రం లో ఎటువంటి కూల్చివేత లు వుండవని, ప్రజలు భయపడవలసిన అవసరం లేదని టిపిసిసి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. ఆయన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పేదల ఇళ్లు కూల్చివేత జరగదని అన్నారు.
సూర్యాపేట కు హైడ్రాతో సంబంధం లేదని, హైడ్రా కేవలం ఒఆర్ ఆర్ లోపల మాత్రమే పనిచేస్తుందని అన్నారు. జిల్లా లతో హైడ్రాకు సంబంధం లేదని, సూర్యాపేట లో ఎఫ్టి ఎల్, బఫర్ జోన్ ల సర్వే చేయమని ప్రభుత్వం నుండి ఆదేశాలు లేవని అన్నారు.
బిఆర్ ఎస్ నాయకులు కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించి, భయానికి గురిచేస్తున్నారని, పేదలు భయపడవలసిన అవసరం లేదని, వారికి కాంగ్రెస్ పార్టీ అండగా వుంటుందని చెప్పారు. భవిష్యత్తు లో హైదరాబాదు లో వరదలు వచ్చినప్పుడు కాలనీలు మునిగిపోకుండా వుండడానికి హైడ్రా చెరువుల పరిరక్షణ కార్యక్రమం చేపట్టిందని అన్నారు.
సూర్యాపేట లో పేదల ఇళ్ల కూల్చివేతలు వుండవని, సద్దల చెరువు, పుల్లారెడ్డి చెరువు లకు ఇప్పటికే చెరువు కట్టల నిర్మాణం జరిగిందని, చెరువు కట్టల బయట జరిగిన నిర్మాణాలు కూల్చడం జరగదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ఇందిరమ్మ రాజ్యం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని, సూర్యాపేట లో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రేషన్ కార్డు ల మంజూరు చేస్తామని చెప్పారు. మూసి నది పరివాహక ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన వారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం డబల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తుందని అన్నారు.
సూర్యాపేట ఏరియా ఆసుపత్రిని 1000 పడకల ఆసుపత్రి గా మారుస్తామని అన్నారు. సూర్యాపేట లో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, రోడ్ల నిర్మాణం చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత సద్దల చెరువు సుందరీకరణ, పార్క్ ల నిర్మాణం కోసం పది కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. ఉర్లుగొండ దేవాలయ అభివృద్ధి కోసం ౩కోట్ల రూపాయలు, పిల్లలమర్రి శివాలయం అభివృద్ధి కోసం రెండున్నర కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు.