TEJA NEWS

ప్రాణాలతో బయట పడతామనుకోలేదు” – సీఎం చంద్రబాబు వద్ద బాధితుల ఆవేదన

విజయవాడలోని పలు వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృతంగా పర్యటించారు.

ముంపు ప్రాంతాల్లో బోట్ల ద్వారా స్వచ్ఛందంగా బయటకు వచ్చిన బాధితులతో సీఎం మాట్లాడారు.

ప్రతి ఒక్కరూ మళ్లీ సాధారణ జీవితం గడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృతంగా పర్యటించారు. ప్రకాశం బ్యారేజీ, భవానీపురం, సింగ్ నగర్ ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం విజయవాడ కలెక్టరేట్‌ వద్దకు ఆయన చేరుకుని తాజా పరిస్థితులపై ఉన్నత అధికారులతో సమీక్షించారు. ముంపు ప్రాంతాల్లో బోట్ల ద్వారా తరలించిన, స్వచ్ఛందంగా బయటకు వచ్చిన బాధితులతో సీఎం మాట్లాడారు.

దీంతో బాధితులంతా తాము రెండు రోజులుగా పడుతోన్న కష్టాలను, బాధలను సీఎం వద్ద వెళ్లబోసుకున్నారు. ఇప్పటికీ బంధువులు, ఇరుగుపొరుగు వారు జలదిగ్బంధంలోనే చిక్కుకొని ఉన్నారని తెలిపారు. ఉదయం నుంచే తమకు నీళ్లు, ఆహారం అందాయని, ఎన్డీఆర్‌ఎఫ్‌ బోట్ల ద్వారానే బయటకు రాగలిగామన్నారు. చుట్టుముట్టిన వరద నీటితో తాము ప్రాణాలతో బయట పడతామనుకోలేదంటూ పలువురు మహిళలు సీఎం చంద్రబాబు వద్ద రోధించారు.

వరద ప్రాంతాల నుంచి బయటకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులను అంబులెన్సులో తరలించేందుకు సీఎం చంద్రబాబు ఏర్పాట్లు చేశారు. రెండు రోజులుగా నిరంతరం శ్రమిస్తూ ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని వరద సహాయక చర్యలు చేపడుతున్నామని బాధితులకు వివరించారు. వందల మంది వరద బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు వరద నీటిలో చిక్కుకుని పడిన ఇబ్బందులు తనను ఎంతో ఆవేదనకు గురి చేశాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ మళ్లీ సాధారణ జీవితం గడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

వరద ప్రభావిత ప్రాంతాలకు ఇంధన శాఖ నుంచి వెయ్యి సోలార్ లాంతర్లు సరఫరా చేశారు. సచివాలయం సిబ్బంది ద్వారా విద్యుత్ లేని ప్రాంతాలకు వీటిని పంపిణీ చేశారు. మరో 4 వేల సోలార్ లాంతర్లను పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. ఉదయం నుంచి వరద ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా 7,220 కిలోల ఆహారం, వాటర్ బాటిళ్లు, మందులు పంపిణీ చేశారు. వరద ప్రవాహంలో చిక్కుకొని ఇబ్రహీంపట్నంలో లైన్‌మెన్‌ వి.కోటేశ్వరరావు, జి.కొండూరు మండలం ముత్యాలంపాడులో పి. శివపార్వతి గల్లంతవ్వగా వారి ఆచూకీ కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలిస్తున్నాయి.

Print Friendly, PDF & Email

TEJA NEWS