TEJA NEWS
  • డ్రగ్స్ మాఫియా గిఫ్ట్ ఆర్టికల్స్ చేదించిన పోలీసులు*

ఇప్పటి వరకు వివిధ రకాలుగా మాదకద్రవ్యాలను చేతులు మార్చుకున్న డ్రగ్స్‌ మాఫియా తాజాగా గిఫ్ట్‌ ఆర్టికల్స్‌పై దృష్టిపెట్టింది. ఒక బాక్స్‌లో మాదకద్రవ్యాలను పెట్టి, గిఫ్ట్‌బాక్స్‌లా పార్శిల్‌ చేసి గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నారు. టాస్క్‌ఫోర్స్‌, పటమట పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో పట్టుబడిన ముఠాను విచారణ చేయగా, ఈ గిఫ్ట్‌ కోణం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని నోయిడా నుంచి ఎండీఎంఏ డ్రగ్‌ను కొరియర్‌ ద్వారా రప్పించుకుంటున్నారని తెలుసుకున్నారు. పోలీసులకు చిక్కిన తిరుమలశెట్టి జీవన్‌కుమార్‌ (సనతనగర్‌), బొంతు నితీష్‌కుమార్‌ (ఫన్‌టైం క్లబ్‌ రోడ్డు), తూలిమెల్లి తరుణ్‌ప్రసాద్‌ (యనమలకుదురు)ను విచారణ చేయగా, అనేక కోణాలు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది.

రప్పించేది ఒకరు.. విక్రయించేది మరొకరు..

నిందితుల్లో జీవన్‌కుమార్‌ అనే వ్యక్తి ఎండీఎంఏ డ్రగ్‌ను విద్యార్థులకు అందజేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. బీటెక్‌ చదివిన జీవన్‌కు ఇంటర్‌ నుంచే డ్రగ్‌ అలవాటు ఉంది. ఆ తర్వాత దాన్ని కొనసాగించాడు. ఉత్తరప్రదేశ్‌లో ఉంటున్న స్నేహితుడు మనోహర్‌.. నోయిడాకు చెందిన రింకీ అనే యువకుడ్ని పరిచయం చేశాడు. ఆ తర్వాత జీవన్‌ దందా కొత్త మలుపులు తిరిగింది. కృష్ణాజిల్లా గంగూరులోని ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతున్న నితీష్‌కుమార్‌కు డ్రగ్‌ను అలవాటు చేశాడు. తర్వాత అతడ్ని తన సహాయకుడిగా మార్చుకున్నాడు. ఇలా ఇద్దరూ కలిసి ఓ పద్ధతి ప్రకారం సరుకు రాబట్టే ప్లాన్‌ చేశారు. నోయిడాలో ఉన్న రింకీకి హైదరాబాద్‌లో ఉంటున్న స్నేహితుల ఇళ్లు, హాస్టళ్ల చిరునామాలు ఇస్తాడు. అక్కడికి నోయిడా నుంచి ఎండీఎంఏను పార్శిల్‌ ద్వారా రప్పించుకుంటాడు.

ట్రాకర్‌ ఆన్‌, డీటీడీసీ అనే రెండు కొరియర్‌ సంస్థల ద్వారా సరుకు హైదరాబాద్‌ చేరుతోంది. చిరునామా వేర్వేరుగా ఉన్నా ఫోన్‌ నెంబర్‌ మాత్రం జీవన్‌దే ఇచ్చేవాడు. పార్శిల్‌ ఇవ్వడానికి వెళ్లిన బాయ్స్‌ ఈ నెంబర్‌కు ఫోన్‌ చేసేవారు. తాను వేరేచోట ఉన్నానని, మర్నాడు తీసుకుంటానని చెప్పేవాడు. ఆ తర్వాత విజయవాడ నుంచి రైల్లో కానీ, బస్సులో కానీ, బైక్‌పై కానీ హైదరాబాద్‌ వెళ్లి తీసుకునేవాడు. ఇలా విజయవాడకు చేర్చిన పార్శిల్‌లోని డ్రగ్‌ను నితీష్‌కుమార్‌ ద్వారా విక్రయించేవాడు. ఏడాదిగా జీవన్‌ ఇలాగే డ్రగ్‌ను తెప్పిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. జీవన్‌, నితీష్‌ సెల్‌ఫోన్లను పరిశీలించగా, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులతో పాటు గుంటూరు జిల్లాలోని డీమ్డ్‌ వర్సిటీ విద్యార్థుల ఫోన్‌ నెంబర్లు ఉన్నట్టు గుర్తించారు. రింకీ అనే వ్యక్తి జీవన్‌కు సరుకును పంపుతున్నప్పటికీ దానికి సంబంధించిన చెల్లింపులు మాత్రం వేరే వ్యక్తికి చేసేవాడు. ఢిల్లీకి చెందిన బంధోపాధ్యాయ చౌదరి అనే వ్యక్తి జీవన్‌కు క్యూఆర్‌ కోడ్‌ను పంపేవాడు. దానికి పేమెంట్‌ సర్వీస్‌ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేసేవాడు. గ్రాము ఎండీఎంఏను రూ.4 వేలకు కొని ఇక్కడి విద్యార్థులకు మాత్రం గ్రాము రూ.6 వేలకు విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురు నిందితులకు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో గురువారం వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం వారిని నాల్గో ఏసీఎంఎం కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి రామ్మోహన్‌నాయుడు 14 రోజుల రిమాండ్‌ విధించారు.