పోలీస్ శిక్షణ కేంద్రంలో మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ ప్రాక్టీస్
ఉమ్మడి ఖమ్మం
ఏవైనా అవాంఛనీయ సంఘటనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సమయంలో అల్లరి మూకలను చెదరగొట్టడానికి మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశమని
పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. శిక్షణలో భాగంగా పోలీస్ శిక్షణ కేంద్రంలో సివిల్, ఎఆర్ పోలీసులు, మాబ్ ఆపరేషన్-మాక్ డ్రిల్ ప్రాక్టీస్ బుధవారం నిర్వహించారు.
విధ్వంసానికి పాల్పడుతున్న సందర్భాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ, జన సమూహాలను నియంత్రించి శాంతిభద్రతలను ఎలా నియంత్రించాలన్న వాటిపై మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ ప్రాక్టీస్ ముఖ్య ఉద్దేశాన్ని సిబ్బందకి వివరించారు.
తొలుత ఓ వైపు ప్లకార్డులు చేతపట్టిన ఆందోళనకారులు, అల్లరి మూకలు మరోవైపు వారిని ఎదుర్కొనేందుకు సిద్ధమైన పోలీసులు జన సమూహాలను కంట్రోల్ చేసేందుకు మొదటగా హెచ్చరికలు వినకపోతే ఉన్నతాధికారుల అనుమతితో భాష్పవాయువు ప్రయోగించడం, ఆ తర్వాత ఫైర్ డిపార్ట్‌మెంట్ వారితో వాటర్ కెనాన్ వారిపై ప్రయోగించడం, లాఠీ ఛార్జీ చేపట్టడం, ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైరింగ్ చేయడం అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే ఫైరింగ్ చేయడం వంటివి డెమో ద్వారా ప్రదర్శించారు. మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశం శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు, ఘర్షణలు తలెత్తినప్పుడు శాంతిభద్రతలను పరిరక్షించడానికి పోలీస్ శాఖ ఎలా వ్యవహరిస్తుంది? ఘర్షణలకు పాల్పడిన వారిపై ఏవిధంగా చర్యలు తీసుకుంటారు? అనే దాని గురించి అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ నిర్వహించినట్లు చెప్పారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ నరేష్ కుమార్, అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్ రావు, ఏసీపీ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.