TEJA NEWS

పీవీ సునీల్‌కుమార్‌ను వెంట‌నే పోలీసులు అదుపులోకి తీసుకోవాలి.. చంద్ర‌బాబుకు ర‌ఘురామ లేఖ‌..

సాక్షుల‌ను బెదిరిస్తున్న సీఐడీ మాజీ చీఫ్‌ను అరెస్ట్ చేయాల‌న్న ర‌ఘురామ‌కృష్ణ‌రాజు
త‌న‌పై టార్చ‌ర్‌ కేసులో సాక్షులుగా ఉన్న పోలీసులు, వైద్యుల‌ను బెదిరిస్తున్నారంటూ ఆరోప‌ణ‌
సునీల్‌కుమార్‌పై జులై 11న ప‌ట్టాభిపురం పీఎస్‌లో హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదైన‌ట్లు వెల్ల‌డి

సాక్షుల‌ను బెదిరిస్తున్న సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్‌ను వెంట‌నే పోలీసులు అదుపులోకి తీసుకోవాలని ఉండి ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణ‌రాజు కోరారు. ఈ మేర‌కు ఆయ‌న ఆదివారం సీఎం చంద్ర‌బాబునాయుడుకు లేఖ రాశారు.

“వైసీపీ హ‌యాంలో నాపై జ‌రిగిన క‌స్టోడియ‌ల్ టార్చ‌ర్ కేసు, దానిలో గుర్తించిన అంశాల‌పై ఈ నెల 27న ప్ర‌ముఖ తెలుగు దిన‌ప‌త్రిక‌లో క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది. ఆ మ‌రుస‌టి రోజు నుంచి పీవీ సునీల్‌కుమార్ కేసులో సాక్షులుగా ఉన్న పోలీసులు, వైద్యుల‌ను బెదిరిస్తున్నారు. ఆయ‌న్ను వెంట‌నే పోలీసులు క‌స్ట‌డీలోకి తీసుకోవాలి.

నా ఫిర్యాదు మేర‌కు అప్ప‌టి సీఎం జ‌గ‌న్‌, డాక్ట‌ర్ ప్ర‌భావ‌తి, విజ‌య్ పాల్‌, పీఎస్ఆర్ ఆంజ‌నేయులు, పీవీ సునీల్‌కుమార్‌పై జులై 11న ప‌ట్టాభిపురం పీఎస్‌లో హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదైంది. ఈ కేసులో నాలుగో నిందితుడైన విజ‌య్‌పాల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు పీవీ సునీల్‌కుమార్ సాక్షుల్ని బెదిరించ‌డం చేస్తున్నారు. అందుకే వెంట‌నే ఆయ‌న్ను పోలీసులు అరెస్ట్ చేయాలి” అని ఎమ్మెల్యే ర‌ఘురామ త‌న లేఖ‌లో పేర్కొన్నారు.


TEJA NEWS