జాతిపిత మహాత్మా గాంధీ జీవితం మనందరికీ స్ఫూర్తి
మాజీ ఎంపీ నామ
ఉమ్మడి ఖమ్మం
జాతిపిత మహాత్మా గాంధీ జీవితం మనందరికీ స్ఫూర్తి అని బిఆర్ఎస్ మాజీ లోక్సభ పక్షనేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఒక ప్రకటన విడుదల చేశారు. గాంధీ సత్యం, అహింస, సామరస్య విధానాలు మాత్రమే కాకుండా, స్వాతంత్య్ర పోరాటంలో ప్రజలందరికీ మార్గదర్శకంగా నిలిచారన్నారు. స్వరాజ్యం కోసం గాంధీజీ చేసిన పోరాటం నేటి సమాజంలోనూ స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. గాంధీ మహాత్ముడు తన సిద్ధాంతాలతో బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడారని పేర్కొన్నారు. దేశ ప్రజలను శాంతి, అహింస, సత్యాగ్రహం వైపు నడిపించి, మన దేశానికి స్వాతంత్య్రాన్ని సాధింపజేశారని గుర్తుచేశారు. ప్రపంచ మానవాళికి అవసరమైన సిద్ధాంతాలను గాంధీజీ బోధించడమే కాకుండా, ఆ బోధనలను స్వయంగా ఆచరించి చూపారన్నారు.
జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ పోరాటం చేశారన్నారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గ్రామ స్వరాజ్యం సాధన కోసం నిరంతర కృషి చేసారని, పల్లెల అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని గాంధీజీ కలలను కేసీఆర్ నిజం చేస్తూ, పల్లె ప్రగతి వంటి పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. ఈ పథకాల ద్వారా గ్రామీణ సమాజంలో స్వావలంబనను ప్రోత్సహిస్తూ, పల్లెల అభివృద్ధి ద్వారా గాంధీ ఆశయాలను సాకారం చేస్తూ, నాడు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ఆదర్శంగా నిలిపారని తెలిపారు. మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవించడం మనందరి బాధ్యత అని, ఆయన చూపిన మార్గం, సమాజంలో ఆర్థిక, సామాజిక సమానత్వం కోసం నడిపిన ఉద్యమం ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఈ గాంధీ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను పాటిస్తూ, అహింస, శాంతి, సత్యం మార్గంలో మన ముందుకు సాగుదామని నామ పిలుపునిచ్చారు.