TEJA NEWS

గడిచిన వంద ఏళ్ళల్లో ఇవే భారీ వరదలు
వేలాది కుటుంబాలు వీటివల్ల నిరాశ్రుయులయ్యారు*
ప్రతీ కుటుంబాన్ని ఆదుకుంటాం
కూసుమంచి మండల పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
బాధిత కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ*

ఉమ్మడి ఖమ్మం

గడిచిన వంద యేళ్ళల్లో రాష్ట్రంలో ప్రస్తుతం కురిసిన వర్షాలకే భారీ వరదలు వచ్చాయని, వీటి ద్వారా వేలాది కుటుంబాలు నిరాశ్రులయ్యాయని తెలంగాణ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కూసుమంచి మండలం తుమ్మల తాండ, పాలేరు, నాను తాండ, నర్సింహులగూడెం గ్రామాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి నష్టాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాలను మంత్రి ఓదార్చారు. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులను పరిశీలించారు. దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి, అధికారులను చర్యలకై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణాలోని పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయన్నారు. వాగులు, వంకలు పొర్లి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వేలాదిమంది కట్టుబట్టలతో మిగిలారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. సుమారు 5438 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాధమిక అంచనా ఉందని, రూ. 2 వేల కోట్ల తక్షణ సహాయం అందించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని మంత్రి అన్నారు. తడిసిన ధాన్యం కనీస మద్దతు ధరకు కొంటామని, తడిసిన బియ్యం తీసుకొని సన్న బియ్యం ఇస్తామని ఆయన తెలిపారు. అధికారులు క్షేత్ర స్థాయిలో ఇంటింటికి తిరిగి జరిగిన నష్టంపై నివేదిక సిద్ధం చేయాలన్నారు. పంట నష్టంపై క్షేత్ర పరిశీలన చేయాలన్నారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా పరిహారం అందుతుందని, కష్ట కాలంలో ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి అన్నారు. నర్సింహులగూడెంలో బాధితులకు మంత్రి బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, ఆర్ అండ్ బి ఎస్ఇ హేమలత, ఇరిగేషన్ ఇఇ వెంకటేశ్వర రావు, పీఆర్ ఇఇ వెంకట్ రెడ్డి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సరిత, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS