TEJA NEWS

యాదమ్మ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియాచెల్లించాలి.

గాయపడిన వారికి పది లక్షలు చెల్లించాలి.

ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి

సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన 15 మంది వ్యవసాయ కార్మికులు ఆత్మకూర్ (ఎస్) మండలం బొప్పారం గ్రామానికి మిరపకాయలు ఏరటానికి వెళుతూ కోటపహాడ్ గ్రామంలో ప్రమాదవశాత్తు ఆటో బోల్తాబడ్డ ఘటనలో చనిపోయిన యాదమ్మ కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించి, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. బుధవారం ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడి సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో మరణించిన యాదమ్మ మృతదేహాన్ని, గాయాల పాలై చికిత్స పొందుతున్న వ్యవసాయ కూలీలను ఐద్వా, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సందర్శించి పరామర్శించారు.

ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ సొంత గ్రామంలో పనులు లేకపోవడంతో వ్యవసాయ కార్మికులు పొట్ట కూటికోసం సుదూర ప్రాంతాలకు ప్రతిరోజు ఆటోలలో ప్రయాణించటం మూలంగా రోడ్డు ప్రమాదం జరిగి వ్యవసాయ కార్మిక మహిళలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచి ఆరు గంటలకే రైతుల భూముల్లో కూలి పని చేసుకొని రాత్రి వచ్చేవరకు ఏడు అవుతుందన్నారు. రెక్కల కష్టం మీద ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ కార్మికులు రోడ్డు ప్రమాదాల మూలంగా చనిపోతున్నారని ఈ మరణాలు ప్రభుత్వ హత్యలేనని అన్నారు. ప్రభుత్వం కూలీలకు సొంత గ్రామాలలో ఉపాధి కల్పిస్తే ఇలాంటి ప్రమాదాలు జరిగేవి కాదన్నారు . వలసల నివారణ కోసం వచ్చిన ఉపాధి హామీని సక్రమంగా అమలు చేయకపోవడం, పని అడిగిన వారికి పని ఇవ్వకపోవడం చేసిన పనికి కూలి గిట్టుబాటు కాకపోవటం మూలంగా కూలీల సుదూర ప్రాంతాలకు కూలి పనుల కోసం వెళ్లడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన నిరుపేద వ్యవసాయ కార్మిక మహిళలు రోడ్డు ప్రమాదానికి గురయ్యారని అన్నారు. యాదమ్మ అనే కూలి మరణించగా. మరొక మహిళ పరిస్థితి విషమంగా ఉందన్నారు. మిగతా మహిళలకు తలకు, కాళ్లకు దెబ్బలు తీవ్రంగా తగిలాయన్నారు. దెబ్బలు తీవ్రంగా తగిలిన మహిళలకు ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కూలీలందరికీ మెరుగైన వైద్యం అందించి ప్రమాదం నుండి వారిని రక్షించాలని కోరారు. ఆటో ప్రమాదం వల్ల చనిపోయిన వారికి, తీవ్ర గాయాల చికిత్స పొందుతున్న వారికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక నిధుల ద్వారా ఆర్థిక సహాయం అందించి కూలీలను ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆశలత, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు మల్లు నాగార్జున రెడ్డి, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.