
బాల్య మిత్రుడి కుటుంబానికి 30.వేల ఆర్థికసాయం అందజేత
సూర్యాపేట జిల్లా : సూర్యాపేట మండల పరిధిలోని జడ్.పి.హెచ్.ఎస్ టేకుమట్ల గ్రామం 2020 – 21 సం”రం పదవతరగతి బ్యాచ్ కు చెందిన బట్టు సతీష్ (31) అనే యువకుడు దురదృష్టవశాత్తు ఈ నెల 4న ఉప్పలపహాడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలయ్యి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. సతీష్ మృతి తో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు, బాల్యమిత్రులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగారు. కుమారుణ్ణి పోగొట్టుకున్న ఆ కుటుంబానికి తమవంతు అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్న సతీష్ బాల్య మిత్రులు దశదిన కార్యక్రమాల ఖర్చుల నిమిత్తం 30.వేల రూపాయలను తోటి మిత్రుల ద్వారా సేకరించి సతీష్ కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ విషయమై మృతుడి స్నేహితులు మాట్లాడుతూ నిత్యం మాతో సంతోషంగా గడిపే వ్యక్తి అకాలమరణం మమ్ములను కలచివేసిందని మా మిత్రుడి మృతి ఆ కుటుంబం తో పాటు మాకు తీరని లోటు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మా స్నేహితుడు లేని లోటును ఎవ్వరూ భర్తీ చేయలేరని వారి కుటుంబానికి మావంతు ఆర్థికసాయం చేయాలని నిర్ణయించుకున్నామని మాతోటి మిత్రుల సహాయంతో 30 వేల రూపాయలను సతీష్ కుటుంబసభ్యులకు అందజేశమని తెలిపారు.
