TEJA NEWS

ప్రతి కుటుంబం, పౌరుల అవసరాలు తెలుసుకోవడానికి కుటుంబ సమగ్ర సర్వే…

-రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఉమ్మడి ఖమ్మం

రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ సర్వే కి కుటుంబ సమగ్ర సర్వే చేపట్టినట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మంత్రి, ఖమ్మం రూరల్ మండలం కోట నారాయణపురం గ్రామంలో కుటుంబ సమగ్ర సర్వే ప్రక్రియను ప్రారంభించారు. గ్రామంలోని షేక్ ఇస్మాయిల్ ఇంటికి వెళ్లి, సమగ్ర సర్వే ప్రారంభించారు. సర్వే లో సూచించిన ప్రశ్నలు అడిగి, నమోదు చేయించారు. మరింత అభివృద్ధి కి స్పష్టమైన ప్రణాళిక రచనకు సర్వే అని, ఎటువంటి అపోహలు లేకుండా సర్వే కు ప్రజలు సహకరించాలని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి కుటుంబం, వార్డు, గ్రామం, నియోజకవర్గo, జిల్లా సమగ్ర సర్వే చేపట్టితే, ఏ వర్గానికి ఏం కావాలో తెలుస్తుందని, ప్రభుత్వానికి ఆ దిశగా చర్యలకు అవకాశం కలుగుతుందని అన్నారు. సమగ్ర సర్వే మొక్కుబడిగా కాక, క్షుణ్ణంగా చేయాలనే తలంపుతో ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు. 75 కాలంలతో కుటుంబ సర్వే చేపట్టడం జరుగుతుందని, దీనివల్ల కులం, మతం అన్నదాని కంటే, సమాజంలో ప్రతి కుటుంబం/పౌరునికి ఏ అవసరాలు ఉంటాయో, ఏ ప్రాంతానికీ, ఏ ఊరికి ఏం అవసరాలు ఉన్నాయో పూర్తిగా తెలుస్తుందని, తద్వారా పరిష్కారానికి మార్గం చూడొచ్చని మంత్రి అన్నారు.

జిల్లాలో 536335 కుటుంబాలను గుర్తించినట్లు, ఇండ్ల జాబితా పూర్తితో వీటి సంఖ్య పెరగవచ్చని అన్నారు. ప్రతి 150 కుటుంబాలకు ఒక ఎన్యుమరేషన్ బ్లాక్ గా చేపట్టినట్లు, మొత్తం 3654 ఎన్యుమరేషన్ బ్లాకులుగా చేసి, 3810 మంది ఎన్యుమరేటర్లు, ప్రతి 10-15 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్ చొప్పున 317 మంది సూపర్వైజర్లు, ప్రతి నియోజకవర్గానికి ఒక సీనియర్ అధికారిని ఇంచార్జి గా, ప్రతి మండలానికి జిల్లా అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించినట్లు మంత్రి అన్నారు.

ఏరోజుకారోజు చేపట్టిన సర్వేని కంప్యూటర్ లో ఫీడింగ్ కు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. బడుగు, బలహీన, దళిత, గిరిజన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి అన్నారు. దేశంలోనే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలపాలని, అధికారులు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయమే కాక, బాధ్యతగా నిర్వర్తించాలని, ఏ చిన్న పొరపాటు, తప్పిదం జరగకుండా పూర్తి పారదర్శకంగా పూర్తి చేయాలని మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా ఎన్యుమరేటర్లకు మంత్రి సర్వే కిట్ల పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, మండల ప్రత్యేక అధికారిణి/జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, నియోజకవర్గ అధికారి/అదనపు డిఆర్డీవో నూరొవుద్దీన్, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, ఖమ్మం రూరల్ తహసీల్దార్ రాంప్రసాద్, ఎంపిడిఓ కుమార్, ఎంఇఓ శ్రీనివాసరావు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS