
కరీంనగర్ బస్టాండ్‌లో ప్రయాణికుల బ్యాగులు దొంగిలిస్తున్న వ్యక్తి అరెస్ట్, నిందితుడి వద్ద నుండి 150 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 10 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు. – కరీంనగర్ పోలీసు కమీషనర్ గౌష్ ఆలం
కరీంనగర్ బస్టాండ్‌లో ప్రయాణికుల లగేజీ బ్యాగుల నుండి చోరీలు చేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుండి 150 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 10 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని కరీంనగర్ పోలీసు కమీషనర్ గౌష్ ఆలం తెలిపారు.
ఈ రోజు ఉదయం కమాన్ చౌరస్తా వద్ద కరీంనగర్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్ తమ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా ముఖానికి మాస్క్ ధరించి తిరుగుతున్న చిగురుమామిడి మండలం నవాబ్ పేట గ్రామానికి చెందిన కంది సంపత్ రెడ్డి (47), అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను బస్టాండ్‌లో రద్దీగా ఉన్న బస్సుల్లో ప్రయాణిస్తూ, లగేజ్ స్టాండ్‌పై ఉన్న ప్రయాణికుల బ్యాగుల నుండి బంగారు నగలు మరియు నగదును దొంగిలిస్తున్నట్లు అంగీకరించాడు. నిందితుడు గతంలో కూడా కరీంనగర్ మరియు అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్లలో అరెస్ట్ అయి జైలుకు వెళ్ళి వచ్చాడని పోలీసులు తెలిపారు.
సంపత్ రెడ్డి ఇటీవల ఫిబ్రవరి 24న కరీంనగర్ బస్టాండ్‌లో ఒక మహిళా బ్యాగ్ నుండి 47 గ్రాముల బంగారం, ఏప్రిల్ 8న గోదావరిఖని నుండి సికింద్రాబాద్ వెళ్లే బస్సులో ఒక వృద్ధుడి బ్యాగ్ నుండి 13 లక్షల రూపాయలు, మరియు ఫిబ్రవరి 14న హైదరాబాద్ వెళ్లే బస్సులో ఒక మహిళా బ్యాగ్ నుండి 16.5 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. దొంగిలించిన సొత్తును దాచి ఉంచడానికి ప్రయత్నిస్తుండగా అతన్ని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు నిందితుడి నుండి స్వాధీనం చేసుకున్న నగదు మరియు ఆభరణాలను సీజ్ చేసి, అతన్ని కోర్టులో హాజరు పరచనున్నామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ కమీషనర్ తెలిపారు.
