జిల్లాలో రోడ్డు ప్రమాదాలను, మాదకద్రవ్యాలను అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టాల నీ ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
వనపర్తి
జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
బుధవారం ఉదయం ఐ.డి. ఒ.సి. సమావేశ మందిరంలో రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ఆర్. గిరిధర్ తరఫున జిల్లాలోని అన్ని మండలాల స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు తమ పరిధిలో ఉన్న రోడ్లు ప్రమాద స్థలాలను గుర్తించి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి తీసుకోవాల్సిన చర్యల పై ఒక్కో మండలం వారీగా పవార్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ముఖ్యంగా వనపర్తి జిల్లా ద్వారా వెళుతున్న జాతీయ రహదారి పై బ్లాక్ స్పాట్ లను, జిల్లా రహదారులు, మున్సిపాలిటీల్లో గల రోడ్డు ప్రమాదాల స్థలాలను గుర్తించారు.
జాతీయ రహదారి పై వెల్టూర్ జంక్షన్, పాలెం జంక్షన్, మదర్ థెరిసా కొత్తకోట కూడలి, ఆమడబాకుల, నాటేవల్లి, తోమాల పల్లి, ఆనంద భవన్ జంక్షన్ పెబ్బేరు, మోడరన్ హైస్కూల్ పెబ్బేరు, రాంగాపూర్ కూడలి లను ప్రధాన ప్రమాద స్థలాలుగా గుర్తించారు.
గుర్తించిన ఈ బ్లాక్ స్పాట్ లలో సూచిక బోర్డులు, బ్లింకింగ్ లైట్లు, హై మాస్ట్ లైట్, తెల్ల రంబల్ స్టిక్స్, వాహనాలు పార్కింగ్ స్థలం వంటివి ఏర్పాటు చేయాలని కలక్టర్ సంబంధిత జాతీయ రహదారి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఎక్కడైనా రోడ్డు ఆక్రమణకు గురి అయి ఉంటే వెంటనే నోటీసులు జారి చేసి తొలగించాలని ఆదేశించారు.
జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలో, మండల స్థాయి రోడ్లు ఎక్కడెక్కడ ప్రమాద స్థలాలను గుర్తించారో అక్కడ కూడా సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం, స్పీడ్ బ్రేకర్ ల ఏర్పాటు, రాత్రి వేళల్లో కనిపించడానికి హై మాస్ట్ లైట్ ఏర్పాటు, రోడ్డు మలుపుల్లో ముళ్ళ పొదల తొలగింపు వంటి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంబంధిత మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్లు ఫ్లెక్సీ లు, ఇతరత్రా అడ్డంకులు, ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలోని ఆసుపత్రులు, షాపింగ్ కాంప్లెక్స్ లలో సెల్లార్ లు ఖచ్చితంగా ఉండాలని, సెల్లర్లను వాహనాలు పార్కింగ్ చేసేందుకు మాత్రమే ఉపయోగించే విధంగా చూడాలని ఆదేశించారు.
ద్విచక్ర వాహనాల పై ముగ్గురు ప్రయాణించడం, ఆటో రిక్షాలు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం తరచుగా చూస్తుంటామని అలాంటి వాటిపై కేసులు నమోదు చేయాలని పోలీస్, ఆర్టీఏ అధికారులను ఆదేశించారు. కొత్తగా వాహన లైసెన్స్ పొందిన వారికి, లైసెన్సు తీసుకోవాలనుకునే వారిని, గుర్తించి ట్రాఫిక్ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని సూచించారు.
జాతీయ రహదారి పై ప్రమాదాలు జరిగిన వెంటనే 1033 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేయాలి
జాతీయ రహదారి పై ప్రమాదం జరిగిన వెంటనే తక్షణ సహాయానికి టోల్ ఫ్రీ నెంబర్ 1033 కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ నెంబరును విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. 108 కు ఫోన్ చేయడం, క్షత గ్రాతులకు సి.ఆర్.పి చేయడం, దగ్గరలోని ఆసుపత్రికి పంపించే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు.
రోడ్డు ప్రమాదం జరిగిన చోటికి ఆర్.టి. ఒ, వైద్య అధికారులు, పోలీస్ అధికారులు చేరుకొని తగు నివేదికలు సిద్ధం చేసి ఆన్లైన్ పోర్టల్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలియజేశారు.
రోడ్ల పై నడిపే కేజ్ వీల్ వాహనాలను గుర్తించి కేసుతో పాటు వాహనం సీజ్ చేయాలని పోలీస్, ఆర్టీఏ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో వ్యవసాయ విస్తీర్ణాధికారుల సహకారం తీసుకొని కేజ్ వీల్ వాహనాలను గుర్తించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు చేపట్టాల్సిన తక్షణ చర్యల పై నివేదిక సమర్పించడం తో పాటు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని లైన్ డిపార్ట్మెంట్ అధికారులను ఆదేశించారు.
అమ్మాయిల భద్రత కొరకు 1098 టోల్ ఫ్రీ నెంబరును వినియోగించుకోవాలి
బాల్య వివాహాలు అరికట్టేందుకు ఈ వారం పొడవునా వివిధ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు కలక్టర్ తెలియజేశారు. బాల్య వివాహాలు నివారించేందుకు అన్ని మండలాల్లో మండల స్థాయి కమిటీ లు, గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తహశీల్దార్లు, పోలీస్ ఇన్స్పెక్టర్ లు, పంచాయతీ సెక్రటరీ లు బాల్య వివాహాల నియంత్రణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బాల్య వివాహాలు చేస్తున్నట్లు తెలిసిన వెంటనే సంబంధిత తల్లిదండ్రులు, వివాహంలో పాలుపంచుకునే వారందరి పై కేసులు పెట్టాలని సూచించారు. పెళ్లి పెద్దలు, బ్రాహ్మణులకు, ముస్లింలలో పెళ్లి చేసే పెద్దకు, పాస్టర్లకు బాల్య వివాహాల పై అవగాహన కలించాలని వారు దగ్గరుండి పెళ్లి చేస్తే కేసులు బుక్ చేయాలని ఆదేశించారు.
ప్రతి నెల 30 వ తేదీన నిర్వహించే సివిల్ రైట్ డే రోజుల బాల్య వివాహాల నియంత్రణ, అవగాహన కొరకు సైతం వినియోగించుకోవాలని సూచించారు.
బాల్య వివాహాలు జరిగిన,అమ్మాయిల ఇవ్ టీజింగ్ జరిగిన, అమ్మాయిల పై జరిగే ఎలాంటి హింసల కైన 1098 కు ఫోన్ చేయాలని కలక్టర్ సూచించారు.
జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలి – జిల్లా కలక్టర్ ఆదర్శ్ సురభి
రోడ్డు భద్రతా కమిటీ సమావేశం అనంతరం అక్కడే మాదక ద్రవ్యాల నివారణ పై సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో మాదక ద్రవ్యాల తయారి, వినియోగం పై డేగ కన్ను ఉంచాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అన్ని పాఠశాలల్లో మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ లు ఏర్పాటు చేయడం జరిగిందనీ, కమిటీ సభ్యులను ఎప్పటికప్పుడు ఉత్తేజపరుస్తూ నియంత్రణ పై అవగాహన కార్యక్రమాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ ఆర్. గిరిధర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నియంత్రణ పై అవగాహన కొరకు కొత్తకోట లో ట్రాఫిక్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కొత్తగా లైసెన్స్ పొందే వారికి ట్రాఫిక్ నియమాల పై అక్కడ అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
దొంగతనాలు అరికట్టేందుకు, ఇతర సామాజిక భద్రతకు అవసరమైన సి.సి. కెమెరాలు సమకూర్చుకునేందుకు జిల్లా కలెక్టరు అవసరమైన మేరకు నిధులు మంజూరు చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
అదనపు కలక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలక్టర్ రెవెన్యూ యం నగేష్, అడిషనల్ ఎస్పీ తేజావత్ రామదాసు, రోడ్లు భవనాలు కార్యనిర్వహక ఇంజనీరు దేశ్య నాయక్, ఆర్డీఓ పద్మావతి, ఆర్టీఏ మానస, జాతీయ రహదారుల అధికారులు, పంచాయతీ రాజ్ ఈ. ఈ మల్లయ్య, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మమ్మ, డా . సాయినాథ్ రెడ్డి, అందరూ ఎస్. ఐ లు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.