TEJA NEWS

అన్ని రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలి.

నియోజకవర్గ ఇంచార్జి ఓటరు నమోదు అధికారి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య

తిరుపతి నియోజకవర్గ పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని తిరుపతి నియోజకవర్గ ఇంచార్జి ఓటరు నమోదు అధికారి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాల మేరకు గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జి ఓటరు నమోదు అధికారి మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రజల నుండి వచ్చిన అన్ని దరఖాస్తులను పరిశీలించాలని, వాటి వివరాలు అందుబాటులో ఉంచాలని అన్నారు. ప్రతి రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని అన్నారు. బి.ఎల్. ఓ.లు ఇంటింటి సర్వే చేసి నివాసాలు మారిన వివరాలు సేకరించి ఫారం-8 అప్లై చేశామని, ఇంకా ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలని ప్రతినిధులను కోరారు. అందరూ కలసికట్టుగా పనిచేసి పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారు చేసేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్.సి.మునికృష్ణ, కార్పొరేటర్ నరసింహ ఆచారి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.