ఆన్లైన్ నమోదు లేకున్నా అయ్యప్ప దర్శనం.. నిరసనలతో వెనక్కితగ్గిన కేరళ ప్రభుత్వం…
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప దర్శనానికి ఆన్లైన్లో మాత్రమే నమోదు చేసుకోవాలన్న తమ నిర్ణయాన్ని కేరళ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతుండటంతో తన నిర్ణయాన్ని మార్చుకుంది.
ఆన్లైన్లో నమోదు చేసుకోకపోయినా భక్తులకు అయ్యప్ప దర్శనం కల్పిస్తామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. వర్చువల్ నమోదు గురించి తెలియకుండా వచ్చిన వారికీ దర్శనం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రమాదానికి గురైనప్పుడు లేదా తప్పిపోయినప్పుడు భక్తులను గుర్తించేందుకు ఆన్లైన్ నమోదు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ విధానం తిరుపతిలోనూ అమలులో ఉందని గుర్తుచేశారు. కాగా గత ఏడాదిలానే స్పాట్ బుకింగ్ విధానాన్ని కొనసాగించనున్నారా లేదా అన్న విషయంపై స్పష్టతనివ్వలేదు..