
నమ్మి చేరదిస్తే.. నరకం చూపాడు.. అన్నం పెట్టిన ఇంటికే సున్నం పెట్టిన కేటుగాడు….. చివరికి కటకటాల్లోకి!
నల్లగొండ జిల్లా, అటవీ శాఖలో పని చేసిన 70 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి మిర్యాలగూడలో నివాసం ఉంటున్నాడు.
ఆయనకు ఉన్న ఏకైక కుమార్తె భర్తతో కలిసి విదేశాల్లో ఉంటోంది.
ఈయన గతంలో త్రిపురారం మండలం అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా పని చేశాడు.
ఆ సమయంలో తిరుమలగిరి మండలం గట్టుమీది తండాకు చెందిన ఆంగోతు గణేష్ తో పరిచయమైంది.
ఉద్యోగ విరమణ తర్వాత గణేష్‌ను వ్యక్తిగత సహాయకుడిగా నియమించుకున్నాడు.
రిటైర్డ్ ఉద్యోగికి సూర్యాపేటలో మరో ఇల్లు, ప్లాటు ఉండడంతో గణేష్ తో కలిసి అప్పుడప్పుడు సూర్యాపేటకు వెళ్లి వస్తుండేవాడు.
జల్సాలకు అలవాటు పడ్డ ఆంగోత్ గణేశ్.. ట్రాన్స్ ఫార్మర్ వైర్లను దొంగతనాలు, వ్యవసాయం చేయగా వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నాడు.
జల్సాలకు డబ్బులు సరిపోకపోవడంతో ఫారెస్ట్ రిటైర్డ్ ఉద్యోగిని బెదిరించి డబ్బులు వసూలు చేయాలని పథకం వేశాడు. ఇందుకు గణేశ్ మంచి టైమ్ కోసం వెయిట్ చేశాడు.
ఈ క్రమంలోనే 2022 మార్చి 6వ తేదీన బాధితుడు, గణేష్ లు సూర్యాపేటకు వచ్చి మద్యం తాగారు. రిటైర్డ్ ఉద్యోగి మత్తులో ఉండగా రాత్రి సమయంలో రోడ్డుపైకి వెళ్లి ఓ మహిళకు డబ్బులు ఇప్పిస్తానని తీసుకొచ్చి ఆమెను బాధిత ఉద్యోగి ఒడిలో రకరకాలుగా అసభ్యకరంగా ఉంచి ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. ఇక ఆతర్వాత అసలు సినిమా చూపించాడు.
పరాయి మహిళతో ఉన్న వీడియోలు, ఫొటోలు కుటుంబ సభ్యులకు చూపిస్తానని సదరు ఉద్యోగిని గణేష్ పలుమార్లు బెదిరించాడు. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజటం స్టార్ట్ చేశాడు. 2022 నుంచి 2024 వరకు పలు దఫాలుగా 19 ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకున్నాడు. వాటిని బాధితుడి కుమార్తె, అల్లుడికి పంపి అసలు, వడ్డీ, హోంలోన్ పేరిట మొత్తం రూ.46 లక్షలు వసూలు చేశాడు. విశ్రాంత ఉద్యోగిని బెదిరిస్తున్న విషయం తెలుసుకున్న గణేష్ భార్య తనకూ బంగారం ఇప్పించాలని కోరింది. దీంతో ఇలా వసూలు చేసిన డబ్బుతో తన భార్యకు కొంత బంగారం కొనుగోలు చేశాడు గణేష్.
బ్లాక్ మెయిల్లో గణేశ్‌కు, అతడి భార్య, బావ మరిది శంకర్ కూడా సహకరించారు. రీసెంట్ గా మరో రూ.3లక్షలు కావాలని ఇద్దరూ కలిసి వేధించారు. ఇక తన వల్ల కాదని ఆ విశ్రాంత ఉద్యోగి ఇంట్లో జరిగిందంతా చెప్పాడు. దీంతో రిటైర్డ్ ఉద్యోగి కుటుంబ సభ్యులు మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పారిపోతున్న వారిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారి వద్ద నుంచి రూ.14లక్షల విలువైన కారుతో పాటు ప్రామిసరీ నోట్లు, నాలుగున్నర తులాల బంగారం, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
