
బొప్పూడి బాజీబాబా దర్గా 42 వఉరుసు మహోత్సవం
సాక్షిత న్యూస్ చిలకలూరిపేట రూరల్ : – శుక్రవారం18న వైభవంగా నిర్వహణకు కమిటీ నిర్ణయం
– అన్ని వసతులు ఏర్పాట్లకు చర్యలు
– ఉరుసు రోజు రాత్రి దర్గా వద్ద భారీ అన్నదానం
బొప్పూడి బాజీబాబావారి దర్గా
చిలకలూరిపేట మండలంలోని బొప్పూడి గ్రామంలో వేంచేసి ఉన్న హజరత్ సయ్యద్ బాజీబాబా 42వ ఉరుసు మహోత్సవం శుక్రవారం నిర్వహించనున్నట్లు దర్గా ముజావర్ బాలసైదాబాబు, అభివృద్ధి కమిటీ సభ్యులు బాజీషహీద్ షేక్ ఖాజా తెలిపారు. బొప్పూడి గ్రామం ప్రారంభంలో ఉన్న ఈ దర్గాలో ఈనెల 18 వ తేదీన వేకువ జామునుంచే ఉరుసు ఉత్సవాలు ప్రారంభం అవుతాయన్నారు. ఈ సందర్భంగా దర్గాకు మరమ్మత్తు పనులు, నూతన రంగులు వేయించారు. ఉరుసు ఉత్సవాలకు విచ్చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏటా క్రమం తప్పకుండా ఈ ఏడాది భారీగా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గ్రామం నుంచి దర్గావరకు, అక్కడ నుంచి హైవేవెళ్లే మార్గంలో కొంతమేర విద్యుత్తు దీపాలంకరణ చేస్తున్నట్లు వివరించారు.
సుదూర ప్రాంతాల నుంచి బాజీబాబా దర్శనానికి వచ్చే భక్తుల కోసం శుక్రవారం రాత్రి భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. అదేరోజు రాత్రి బొప్పూడి గ్రామం నుంచి బాబావారీ గంథం బయలుదేరి గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఊరేగింపు ఉంటుందన్నారు. దర్గా వద్ద పలు ఖురాన్ బోధన, నమాజ్ తదితర ఆధ్మాత్మిక కార్యక్రమాలతో భక్తులు జాగరం చేస్తారన్నారు. మరుసటి రోజు శనివారం తెల్లవారుజామన గంథం దర్గాకు చేరుకుంటుదని, ముజావర్ల ఆధ్వర్యంలో బాబావారికి ఫాతెహా(దీపారాధన) నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం గంథం, ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వైభవోపేతంగా నిర్వహించే ఈ ఉరుసుమహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై బాజీబాబాను దర్శించుకోవాలని కోరారు.
