TEJA NEWS

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు.

దేశంలో నిత్యం మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, అత్యాచారాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాశారు.

ఇలాంటి తీవ్రమైన నేరాలకు పాల్పడేవారిపై వేగంగా, కఠిన చర్యలు తీసుకునేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని దీదీ సూచించారు. ఇక ఇలాంటి కేసులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి.. 15 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి శిక్షలు విధించాలని కోరారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఉన్న ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో విధుల్లో ఉన్న ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారిన వేళ.. ప్రధాని మోదీకి మమతా బెనర్జీ లేఖ రాయడం తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది.
దేశవ్యాప్తంగా మహిళలు, బాలికలు, చిన్నారులపై రోజూ జరుగుతున్న లైంగిక దాడులు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయని.. వీటిని నియంత్రించేందుకు కఠిన చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కోల్‌కతాలో డాక్టర్‌పై హత్యాచార ఘటన ప్రస్తుతం దేశం మొత్తాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న వేళ ప్రధాని మోదీకి దీదీ లేఖ రాయడం గమనార్హం. దేశంలో నిత్యం దాదాపు 90 లైంగిక దాడుల కేసులు నమోదవడం ప్రజల్లో తీవ్ర భయోత్పాతం కలిగిస్తోందని ప్రధానికి రాసిన లేఖలో మమతా బెనర్జీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని.. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అలపన్‌ బందోపాధ్యాయ్‌ గురువారం వెల్లడించారు.

దేశవ్యాప్తంగా మహిళలపై పెరుగుతున్న అరాచకాలు సమాజంలో విశ్వాసాన్ని, మనస్సాక్షిని ప్రభావితం చేస్తున్నాయని ప్రధానికి రాసిన లేఖలో దీదీ పేర్కొన్నారు. మహిళలు ఈ సమాజంలో భద్రత, నమ్మకంతో జీవించేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని ఆ లేఖలో మమతా బెనర్జీ ప్రస్తావించారు. ఇలాంటి అరాచకాలకు చరమగీతం పాడేందుకు చర్యలు తీసుకోవడం మన కర్తవ్యమని తెలిపారు. ఇలాంటి అత్యంత హేయమైన నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం ఒక కఠిన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా తక్షణమే ఈ కేసులను వేగంగా విచారణ జరిపేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని బెంగాల్ ముఖ్యమంత్రి కోరారు. ఇలాంటి దారుణమైన కేసుల్లో 15 రోజుల్లోనే విచారణ ముగిసేలా చూడాలని ఆమె ప్రధానికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.


TEJA NEWS