TEJA NEWS

భారీవర్షాల హెచ్చరికతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇక వాతావరణ శాఖ తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవలసిన చర్యలు, తీసుకుంటున్న జాగ్రత్తలు తదితర విషయాల పైన వారితో మాట్లాడారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి

భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు పడుతున్న కారణంగా అలర్ట్ అయిన తెలంగాణ ప్రభుత్వం, ఎక్కడా జనజీవనానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

రైతులు వర్షాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి

హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన వర్షాలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరో మూడు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా రైతాంగం వర్షాల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

ధాన్యం తడవకుండా చర్యలు చేపట్టండి

ధాన్యం కొనుగోలు కేంద్రాలు మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, కాంటాలు వేసిన ధాన్యాన్ని వెంటనే ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని రేవంత్ రెడ్డి సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇక చినుకు పడితేనే చిత్తడిగా మారే హైదరాబాద్లో వర్షం కారణంగా రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని పేర్కొన్నారు.

భారీ వర్షాల హెచ్చరిక పంపిన బంగాళాఖాతం!

హైదరాబాద్ లోనూ అధికారులకు కీలక ఆదేశాలు

ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ లకు కీలక ఆదేశాలు ఇచ్చారు. జిహెచ్ఎంసి పరిధిలో విద్యుత్, పోలీస్, హైడ్రా, జిహెచ్ఎంసి విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.