TEJA NEWS

విచారం వ్యక్తం చేస్తున్నా.. సుప్రీంకోర్టుకు సీఎం రేవంత్ క్షమాపణలు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన కామెంట్స్ పై సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయంటూ సీఎం ట్వీట్ లో తెలిపారు. తనకు న్యాయ వ్యవస్థపై అపారమైన నమ్మకం ఉందన్న సీఎం రేవంత్… సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. తన వాఖ్యలను తప్పుగా చిత్రీకరించి ప్రచారం చేయడంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు ట్విట్టర్ లో వెల్లడించారు. కవితకు బెయిల్ రావడంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు గురవారం తప్పుబట్టింది. మేం రాజకీయ పార్టీలతో చర్చించి ఆర్డర్ ఇవ్వాలా? ఓ సీఎం అలాంటి వ్యాఖ్యలు ఎలా చేయగలరు? అని మండిపడింది. బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తి కోర్టు తీర్పును ఎలా తప్పుపడతారని ప్రశ్నించింది. అయితే ఇలాంటి కామెంట్స్‌ను తాము పట్టించుకోమని, మనస్సాక్షి ప్రకారమే నడుచుకుంటామని జస్టిస్ గవాయి ధర్మాసనం స్పష్టం చేసింది.


TEJA NEWS