అమరావతిపై నిరంతర పర్యవేక్షణ
కన్సల్టెన్సీలతో పనులపై నిఘా
చెప్పినవి అమలు చేయకపోతే నోటీసులు
అమరావతికి రుణం ఇస్తున్న ప్రపంచబ్యాంకు నిరంతరం పర్యవేక్షణ చేయనుంది. ఒప్పందాల్లో భాగంగా పరపతి నివేదికలో ఈ అంశాన్ని ప్రపంచబ్యాంకు ప్రస్తావించింది. ప్రతి పనినీ సొంత కన్సల్టెన్సీలతో పర్యవేక్షణ చేయనుంది. దీనికోసం టెండర్లకు సంబంధించిన సమాచారం, చేపడుతున్న కంపెనీలు, వాటి వివరాలూ, చేస్తున్న పని వివరాలనూ ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. వీటిపై ప్రపంచబ్యాంకు సూచించిన కన్సల్టెన్సీలు తనిఖీలు చేస్తుంటాయి. ఒప్పందంలో పేర్కొన్న పని జరిగిందని, మిగిలిన నిధులు విడుదల చేయొచ్చని అవి సూచిస్తే నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఉంటారు. దీనికోసం సెక్షన్ 4లో అనేక అంశాలు పేర్కొన్నారు. డిస్బర్సమెంట్ లింక్డ్ రిజల్ట్స్(డిఎల్ఆర్-పంపిణీ నిధుల ఫలితాలు)ల్లో ఎప్పుడు ఏమి చేస్తామన్నారు. ఏమిచేయాలనే విషయాలను ప్రస్తావించారు. అమరావతికి రుణం అంగీకరించే నాటికి అమెరికన్ డాలరుకు రూ.84.09పైసలుగా పేర్కొంది.
రుణ ఒప్పంద పత్రాన్ని గ్రహీతలు ఎక్కడా బహిర్గతం చేయకూడదని, ప్రపంచబ్యాంకు అనుమతి లేకుండా కంటెంట్ కూడా చెప్పకూడదని మొదటిపేజీ నిబంధనల్లోనే స్పష్టంగా పేర్కొన్నారు. తాము ఇచ్చే రుణానికి అనుగుణంగా పేర్కొన్న నిబంధనలు అమలు చేశామని ఎప్పటికప్పుడు వారు నివేదిక సమర్పించాల్సి ఉంది. అయితే అప్పటి వరకూ డ్రా చేసుకున్న నిధులు వినియోగానికి సమగ్ర నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. దీనిపై సంతృప్తి చెందితే తరువాత నిధులు ముందస్తుగానే డ్రా చేసుకోవచ్చని పేర్కొంది. సెక్షన్ 4 పార్ట్ బి1లో ఈ అంశాన్ని పేర్కొన్నారు. నిధులు డ్రా చేసుకున్న తరువాత చెప్పిన నిబంధనల అమలు సంతృప్తికరంగా లేకపోతే బ్యాంకు ఇచ్చిన క్లోజింగ్ సమయంలోపు అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుందని సెక్షన్ 4 పార్ట్ బి2లో పొందుపరిచారు. అలాగే సూచించిన తేదీలోపు ఫలితాలు సాధించలేకపోతే బ్యాంకు రుణ గ్రహీతకు నోటీసు ఇస్తుందని, విత్‌డ్రా చేసుకోకుండా మిగిలిన మొత్తాన్ని షెడ్యూలు 4లో పేర్కొన్న ఫార్ములా ప్రకారం తగ్గిస్తామనీ సెక్షన్ 4 పార్ట్ బి2లో పొందుపరిచారు. అమరావతిని రెండు దశల్లో అమలు చేయనుండగా మొదటిదశలో రూ.30,644 కోట్లు ఖర్చు చేయనున్నారు. నిబంధనల ప్రకారం అమరావతిలో పట్టణాభివృద్ధి సదుపాయాల అమలు, నిర్మాణాలకు చట్టపరమైన అనుమతులు తీసుకోవాల్సి ఉందని స్పష్టంగా పొందుపరిచారు. మొదటిదశ అభివృద్ధిలో 2025-2029 మధ్యకాలంలో సదుపాయాలు, మంచినీటి సరఫరా, అమరావతి గవర్నమెంటు కాంప్లెక్స్ ఒకటో జోన్ నుండి ఏడో జోన్ పదోజోన్ అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ప్రపంచబ్యాంకు ప్రొగ్రామ్ ఫర్ రిజల్ట్స్(పిఫర్ఆర్)లో అమరావతి గరవ్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని భవనాలు, ఒకటీ మూడు జోన్లు, 5బి, 5డి, 6 జోన్లలో ఫలితాలు సాధించాలని పేర్కొంది. ప్రపంచబ్యాంకు, ఎడిబి రెండూ సమన్వయంతో నిధులు విడుదల చేయంతోపాటు ఒకే సంస్థ ద్వారా తనిఖీలు నిర్వహిస్తాయనీ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు.