
రక్తపోటు నియంత్రణకు యోగా దోహదం
** స్విమ్స్ లో ప్రపంచ రక్తపోటు దినోత్సవ సదస్సు
తిరుపతి: తిరుపతిలోని టీటీడీకి చెందిన శ్రీ వేంకట్వేర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో “ప్రపంచ రక్తపోటు దినోత్సవ సదస్సును ఓ.పి.డి. బ్లాక్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్.రామ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రక్తపోటు నియంత్రణకు నిత్యం యోగా సాధన చేయడం ఎంతో మేలని పేర్కొన్నారు.
కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజశేఖర్ ఆదేశానుసారం ఈ కార్యక్రమం నిర్వహించడం అయినది. కార్డియాలజి సీనియర్ ప్రొఫెసర్ డా॥ వనజాక్షమ్మ మాట్లాడుతూ.. అధిక రక్తపోటును కంట్రోల్ ఉంచుకోవడానికి ప్రతి రోజు యోగా, ధ్యానం లాంటివి చేసుకుంటూ, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలన్నారు. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే అధికరక్తపోటును నియంత్రించవచ్చునన్నారు. పండ్లు, కూరగాయలు, అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుందన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసే తత్వం అలవాటు చేసుకోసువడం వల్ల శరీరంలో అధిక కొవ్వును అరికట్టవచ్చునని, ప్రాసెసింగ్ ఫుడ్ తీసుకోకపోవడం మంచిదని సూచించారు.
కార్డియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా॥ హరీష్ చౌదరి మాట్లాడుతూ బీపీని కంట్రోల్ ఉంచుకోవడం వల్ల స్ట్రోక్, పక్షవాతం లాంటివి తగ్గించుకోవచ్చు అన్నారు . ప్రతి రోజు ఉదయం, సాయంత్రం 20 నిమిషాలు పాటు వ్యాయామం చేయడం వల్ల బీపిని కంట్రోల్లో వుంచుకోవచ్చునని తెలిపారు. అధికంగా మందులు వాడటం వల్ల కిడ్ని సమస్యలు వచ్చే ప్రమాదం వుందన్నారు. సోడియం తక్కువగా వుండే ఆహార పదార్థాలు తీసుకోవాలని తెలిపారు. అధికబరును నియంత్రించుకోకపోతే అధికరక్తపోటుకు గురికావాల్సి వస్తుందన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డా॥ ఉషారాణి మాట్లాడుతూ*… రక్తపోటు అందరికీ ఉంటుంది కానీ అది నార్మల్గా వుందా లేదా అనేది క్రమంగా చెక్ చేసుకుంటూ వుండాలన్నారు. కొంత మందికి వయస్సు నిమిత్తం వల్ల బీపి రావచ్చు దానికి కంగారుపడాల్సిన అవసరంలేదని, ఫ్యామిలీలో ఎవరికైన బీపి వుంటే మనకు వచ్చే అవకాశాలు వుంటాయన్నారు. బి.పి రాకుండా మన జీవనశైలిలో కొంచెం వ్యాయామం, మ్యూజిక్ వినడం లాంటివి చేయడం వల్ల బీపిని కంట్రోల్లో వుంచుకోవచ్చునన్నారు. మందులు వేసుకునేటప్పుడు అన్ని మందులు కలిపి వేసుకోవడం చేయకుండా కొంత సమయం విరామం ఇచ్చి వేసుకుంటే మందులు మంచిగా పనిచేసే అవకాశం ఎక్కువగా వుంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో కార్డియాలజీ విభాగపు వైద్యులు, మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ కోబాకు భూపాల్, పీఆర్వో విభాగం సిబ్బంది అమర్, సుబ్రహ్మణ్యం రెడ్డి, గణేష్, సుందర్, కార్థియాలజీ విభాగం పీఏ దీప, పలువురు పేషంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.
