TEJA NEWS

నియోజకవర్గ రైతాంగాన్ని ఉద్యానవన పంటల సాగుదిశగా ప్రోత్సహించండి : మాజీమంత్రి ప్రత్తిపాటి

  • హార్టీ కల్చర్ కు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాల గురించి రైతాంగానికి వివరించి, పంటలు సాగుచేసేలా చూడండి : ప్రత్తిపాటి.
  • ఉద్యానవన శాఖాధికారులతో సమీక్ష సమావేశంలో అధికారులకు పలుసూచనలు చేసిన మాజీమంత్రి

ప్రభుత్వం ఉద్యానపంటలకు అందించే ప్రోత్సాహకాల గురించి తెలియచేసి, నియోజకవర్గ రైతాంగాన్ని ఆ పంటల సాగుదిశగా ప్రోత్సహించాలని, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చేలా అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు శిక్షణ ఇవ్వాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. ఉద్యానపంటల సాగుదారులకు ప్రభుత్వం నుంచి అందే రాయితీలు, పరికరాలు, రుణాలపై సంబంధిత శాఖ సిబ్బందితో ప్రత్తిపాటి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చిలకలూరిపేట పరిసర ప్రాంత రైతులు ఎక్కువగా వాణిజ్యపంటలు సాగుచేస్తూ నష్టపోతున్నారని, వారిని ఉద్యానపంటల సాగువైపు మళ్లించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. తృణధాన్యాలు, పూలు, పండ్ల తోటల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలు, ఆయా ఉత్పత్తులకు మార్కెట్లో ఉండే గిరాకీ, వాటికి లభించే ధరల వివరాలు రైతులకు తెలియచేయాలన్నారు. ఇప్పటికే కొన్నిగ్రామాల్లో డ్రాగన్, బొప్పాయి సాగు చేపట్టారని, ఆయా పంటల సాగులోని లాభనష్టాలపై అధ్యయనం చేయాలన్నారు. రాయలసీమలో ఉద్యానవన పంటల సాగును ప్రభుత్వం విరివిగా ప్రోత్సహిస్తోందని, భవిష్యత్ లో ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో నీటివసతిఉన్న మెట్టభూముల్లో ఆ దిశగా చర్యలు చేపడుతుందని ప్రత్తిపాటి తెలిపారు. నియోజకవర్గవ్యాప్తంగా ఉద్యానవన పంటలు సాగుచేసిన రైతులకు ప్రభుత్వం నుంచి రూ.50లక్షల సబ్సిడీ అందినట్టు, భవిష్యత్ లో అది మరింత పెరిగేలా చూస్తామని ఉద్యానవన శాఖాధికారి విశాల్ మాజీమంత్రికి తెలియచేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీలు, పరికరాలు, ఇతర రాయితీలపై హార్టీకల్చర్ అధికారులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని, ఏవైనా సమస్యలుంటే తక్షణమే తనకు తెలియచేయాలని ప్రత్తిపాటి సూచించారు. సమావేశంలో నాయకులు నెల్లూరి సదాశివరావు, బండారుపల్లి సత్యనారాయణ, జవ్వాజి మధన్ మోహన్, కామినేని సాయిబాబు, కందిమల్ల రఘురామారావు, సుబ్బారావు, అధికారులు పాల్గొన్నారు.