TEJA NEWS

అలరించిన ఆలయనృత్యం

రాజమహేంద్రవరం : విఖ్యాత నాట్యపండితుడు,నర్తన యోగిగా పేరొందిన డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్ పునఃసృష్టి చేసిన ఆలయ నృత్య ప్రదర్శన అద్భుతంగా జరిగింది.శ్రీ సద్గురు సన్నిధి నెలవారీ కార్యక్రమంలో భాగంగా గోదావరి గట్టున ఉన్న శ్రీత్యాగరాజ నారాయణదాస సేవాసమితి ప్రాంగణంలో డాక్టర్ సప్పా శిష్యులు 12 మంది ఆగమనర్తన రీతిలో ఆలయనృత్యాన్ని ప్రదర్శించారు.తొలుత కుంభహారతితో ఆరుషి ప్రవేశించగా భువన,రిషి హాసిని, ఆరుషి, శరణ్య, నయనిక, నవ్యశ్రీ, అశ్రిత పుష్పాంజలి సమర్పించారు. అద్దితచారి నృత్యాన్ని కీర్తి, జ్ఞాన అక్షర, కామాక్షి,తేజశ్రీ,పరిణిత రసరమ్యంగా నర్తించారు.సప్పా పరిశోధనాఫలం పంచభూత నర్తనం, బ్రహ్మ కడిగిన పాదం తదితర కీర్తనలు అద్భుతంగా నర్తించి నవరసాలు పండించారు.నృసింహుని రౌద్రం,రాముని సౌమ్యం,కృష్ణుని చిలిపి తాండవం,అహల్య ముగ్ధమోహనత్వం ప్రేక్షకులను అలరించి తన్మయం గావించాయి.ఈ ప్రదర్శనను ఆద్యంతం తిలకించి పులకించి పోయారు. సద్గురు సన్నిధి స్థాపకులు మధుసూదనరావు తదితర ప్రముఖులు డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్ ను ఘనంగా సత్కరించి,12 మంది నర్తకీమణులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందించారు.


TEJA NEWS