
ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ను కలిసిన ఈ.పి.ఎస్ 95 పెన్షనర్స్
పార్లమెంట్ లో పెన్షన్ పెంపు విషయం ప్రస్తావించాలని వినతి పత్రం అందజేత
విజయవాడ : పబ్లిక్ , ప్రైవేట్ సెక్టార్స్ లో పనిచేసి రిటైర్డ్ అయిన ఈ.పి.ఎస్.95 పెన్షనర్స్ వెల్పేర్ అసోసియేషన్ సభ్యులు, నేషనల్ యాజిటేషన్ కమిటీ ఎన్.టి.జిల్లా సభ్యులు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ను కలిశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ భవనం ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం వారంతా ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ను కలిసి తమకు ఈ.పి.ఎఫ్.వో పెన్షన్ స్కీమ్ కింద ఇచ్చే పెన్షన్ ను కోషియారి కమిటీ సిఫార్స్ ప్రకారం ఇప్పటి కాలానికి అనుగుణంగా కనీస ఫించన్ రూ.7,500 లతో పాటు కరువుభత్యం కలిపి ఇచ్చే అంశం పార్లమెంట్ లో ప్రస్తావించాలని వినతి పత్రం అందజేశారు.
కోషియారి కమిటీ 2013లో కనీస ఫించన్ రూ.3,000 లతో పాటు కరువు భత్యం కలిపి ఇవ్వాలని కేంద్రప్రభుత్వానికి సిఫార్స్ చేసింది. కోషియారీ కమిటీ నివేదిక సమర్పించి ఎనిమిదేళ్లు గడిచిన ఇప్పటికీ ఆ సిఫార్స్ అమల్లోకి రాలేదని వివరించారు. పార్లమెంట్ తమ సమస్యను ప్రస్తావించి పరిష్కరించే విధంగా కృషి చేయాలని ఈ.పి.ఎస్.95 పెన్షనర్స్ వెల్పేర్ అసోసియేషన్ తరుఫున దేశ వ్యాప్తంగా ఎంపి లందరికీ వినతి పత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. వారి సమస్యను తెలుసుకున్న ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) సానుకూలంగా స్పందించి లోక్ సభలో ఈ అంశం ప్రస్తావనకు తీసుకువస్తానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఈ.పి.ఎస్.95 పెన్షనర్స్ వెల్పేర్ అసోసియేషన్ సౌతిండియా జాయింట్ సెక్రటరీ ఎల్.మురళీ కృష్ణ,నేషనల్ యాజిటేషన్ కమిటీ నేషనల్ జాయింట్ సెక్రటరీ కె.సాంబశిరావు , నేషనల్ యాజిటేషన్ కమిటీ ఎన్.టి.జిల్లా నాయకులు కొల్లిపర శ్రీనివాసరావు, నేషనల్ టి.ఎన్.టి.యు.సి వైస్ ప్రెసిడెంట్ చాగంటి నరసింహరావు, కె.మాధవరావు లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
