
ఆరుగాలం కష్టించి సాగు చేస్తున్న రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించే నూజివీడు కంపెనీ యాజమాన్యంపై పిడి యాక్ట్ నమో దు చేయాలని డిమాండ్ …
సాగుకు సరిపడా విత్తనాలను ప్రభుత్వమే సరఫరా చేయాలని విజ్ఞప్తి
—- బీసీ పొలిటికల్ జెఎసి రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్
వనపర్తి
నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపాలని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
గురువారం మదనాపూర్ మండలం గోపన్ పేట గ్రామంలో నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులతో మాట్లాడి, ధాన్యాన్ని పరిశీలించారు.
అనంతరం రాచాల మీడియాతో మాట్లాడుతూ నూజివీడు సీడ్స్ యాజమాన్యం ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా రైతులను నమ్మించి నకిలీ సీడ్స్ వ్యాపారం చేస్తుందన్నారు.
అలంపూర్ నియోజకవర్గం, మారు మునగాల గ్రామానికి చెందిన లక్ష్మీకాంత రెడ్డి అనే ఏజెంట్ ఎకరానికి 40 బస్తాల దిగుబడి వస్తుందని నమ్మబలికి రైతులకు నకిలీ సీడ్స్ ఇచ్చారని, తీరా పంట చూస్తే ఎకరానికి 10 నుంచి 20 బస్తాలకు మించడం లేదన్నారు..
ఆరుగాలం కష్టపడి తిండితినక, నిద్రలేక వ్యవసాయం చేస్తున్న రైతులకు నకిలీ విత్తనాలు పంపిణీ చేసి రైతులను తీవ్ర అప్పులపాలు చేసిన నూజివీడు కంపెనీపై కఠినచర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరుకి, ఎస్పీ కి విజ్ఞప్తి చేశారు.
మాకు విత్తనాలు విక్రయించిన ఏజెంట్ ఫోన్ ఎత్తడం లేదని, ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, తమకు ఎలాగైనా న్యాయం జరిగేలా చూడాలని స్థానిక రైతులు రాచాలతో మొరపెట్టుకున్నారు.
వెంటనే ఏజెంటుకు ఫోన్ చేస్తే ఎత్తకపోవడంతో హెడ్ ఆఫీస్ కు ఫోన్ చేయగా అతడు నిర్లక్ష్య సమాధానం ఇవ్వడంతో అతడిపై రాచాల ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం సాగుకు సరిపడా విత్తనాలు సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న యాదవ్, ఆత్మకూరు మండల ప్రధాన కార్యదర్శి అక్కల మల్లేష్ గౌడ్, కొత్తకోట మండల అధ్యక్షుడు అంజన్న యాదవ్, రైతులు కొండన్న, ఆంజనేయులు, వెంకటేష్, విష్ణు గౌడ్, మహమూద, వెంకటన్న, దాసరి కొండన్న తదితరులు పాల్గొన్నారు.
