TEJA NEWS

అసంపూర్తి ఇళ్ల నిర్మాణంపై దృష్టిపెట్టండి. ప్రభుత్వ సాయం వివరించి ఇళ్లు పూర్తయ్యేలా చర్యలు చేపట్టండి : మాజీమంత్రి ప్రత్తిపాటి

  • గృహనిర్మాణశాఖ సమీక్షలో అధికారులకు స్పష్టం చేసిన ప్రత్తిపాటి
  • అందరికీ ఇళ్లు పథకంలో పేదల సొంతింటికల సాకారానికి కూటమిప్రభుత్వం చేపట్టిన చర్యల్ని ప్రజలకు వివరించండి: పుల్లారావు

2014-19, 2019-24లో నియోజకవర్గవ్యాప్తంగా మంజూరైన ఇళ్లు, మధ్యలో నిలిచిపోయిన వాటిపై అధికార యంత్రాంగం దృష్టిపెట్టాలని, అసంపూర్తి ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి, కూటమిప్రభుత్వ సహాయ నిర్ణయాలు వివరించి ఇళ్ల నిర్మాణం జరిగేలా చూడాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. గురువారం ఆయన తన నివాసంలో గృహనిర్మాణ అధికారులతో నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి పీడీ ఎస్.వేణుగోపాల్, ఈఈ బీ.శివలింగం, మండలాల ఏఈలు కూటమినేతలు హాజరయ్యారు. సమావేశంలో ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద 2014-19, 2019-24మధ్య వివిధ విభాగాల కింద మంజూరైన ఇళ్లు, అసంపూర్తిగా నిలిచిన, పూర్తైన ఇళ్ల వివరాలు, లబ్ధిదారుల సమాచారంపై మాజీమంత్రి అధికారుల్ని ఆరాతీశారు. 2014-19 మధ్య వివిధదశల్లో 1820 ఇళ్లు నిలిచిపోయాయని, 2019-24 మధ్య దాదాపు 2652 ఇళ్లు ఆగిపోయాయని అధికారులు చెప్పగా, తక్షణమే వాటి పున: నిర్మాణంపై దృష్టిపెట్టాలని ప్రత్తిపాటి అధికారుల్ని ఆదేశించారు. అవసరమైతే లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వం అందించే చేయూత గురించి తెలియచేసి, ఇళ్లు పూర్తయ్యేలా చూడాలన్నారు. 2014-19 మధ్య ఆగిపోయిన ఇళ్లకు రూ.1,61,000, 2019-24 మధ్య నిలిచిపోయిన ఇళ్లకు రూ.1,80,000లు కూటమిప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధమైన విషయం లబ్ధిదారులకు తెలియచేయాలన్నారు. అందులో అదనంగా బీసీ, ఎస్సీ లబ్ధిదారులకు రూ.50వేలు, ఎస్టీలకు రూ.70వేలు ఇవ్వనున్న విషయం తెలియచేయాలని, ప్రభుత్వ సాయం అందుతుందనే నమ్మకం కలిగితే లబ్ధిదారులు ఇంటి నిర్మాణంపై దృష్టి పెడతారని ప్రత్తిపాటి తెలిపారు.

పీఎంఏవై తొలిదశ ఇళ్ల నిర్మాణం, రెండోదశ లబ్ధిదారుల ఎంపిక త్వరగా పూర్తిచేయండి..

అదేవిధంగా పీఎంఏవై తొలిదశ ఇళ్ల నిర్మాణ సమస్యల్ని కూడా వెంటనే పరిష్కరించాలని ప్రత్తిపాటి అధికారులకు చెప్పారు. రెండోదశ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇల్లు మంజూరుచేయాలని మాజీమంత్రి స్పష్టంచేశారు. ఇళ్ల నిర్మాణ ప్రక్రియను సులభతరం దిశగా ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటోందని, పట్టణప్రాంతాల్లో 100 గజాల్లోపు నిర్మాణాలకు ప్లాన్ అప్రూవల్ నుంచి మినహాయింపు ఇచ్చిందన్నారు. అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం గ్రామాల్లోని పేదలకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు 2 సెంట్లు స్థలం ఇవ్వాలని నిర్ణయించిందని, దీనిపై అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలని పుల్లారావు తెలిపారు.
దారిద్ర్యరేఖకు దిగువన ఉండేపేద కుటుంబాలకు ఉచితంగానే ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైందని, అవసరమైతే భవిష్యత్ లో ఇంటినిర్మాణం కూడా చేస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. సమావేశంలో జనసేన ఇంచార్జి తోట రాజా రమేష్, టీడీపీ నాయకులు నెల్లూరి సదా శివరావు, జవ్వాజి మధన్ మోహన్, షేక్ ఖాదర్ భాషా తదితరులున్నారు.