నరసరావుపేట లో గంజాయి అమ్మకాల ముఠా…కాలేజీ పక్కన ఉన్న శ్మశానంలోనే దుకాణమెట్టేశారు…పక్కా సమాచారం తో ముఠా ని అరెస్ట్ చేసిన పోలీసులు
శివ శంకర్. చలువాది
పల్నాడు జిల్లా
నేరగాళ్లు, స్మగ్లర్లు రోజురోజుకూ బరితెగిస్తున్నారు.
పోలీసులకు దొరకకూడదనే ఉద్దేశంతో కొత్త కొత్త ప్లాన్లు వేస్తున్నారు.
మరీ ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ రవాణా సమయంలో స్మగ్లర్లు వేసే ప్లాన్లు చూస్తే.. ఒక్కోసారి పోలీసులు కూడా అవాక్కయ్యేలా ఉంటాయి.
అలాంటిదే… పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో ఘటన వెలుగు చూసింది.
గంజాయి మత్తుకు కుర్రాళ్లను బానిసలను చేసిన ఓ ముఠా.. తమ గంజాయి అక్రమాలు, అమ్మకాలకు శ్మశానాన్ని ఎంచుకున్న వైనం బయటపడింది.
నరసరావుపేటలో గంజాయి అమ్మకాలు పెరిగాయనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
గంజాయిని అక్రమంగా తరలించేవారిపైనా.. వాటిని విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచారు.
ఈ క్రమంలోనే నరసరావుపేటలోని ఓ కాలేజీ పక్కన ఉన్న శ్మశానంలో గంజాయిని అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో ఆ ప్రాంతంలో నరసరావుపేట పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో.. శ్మశానంలో గంజాయి అమ్ముతున్న ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి ఏడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే 8 బైక్లు, కారు సీజ్ చేశారు. వీట్ విలువ రూ.13 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ముఠా గంజాయిని విశాఖపట్నం నుంచి తీసుకువచ్చి నరసరావుపేటలో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
నరసరావుపేటను గంజాయి రహిత పట్టణంగా మార్చాలనేదే తమ లక్ష్యమన్న పోలీసులు.. దీనికి పౌరులు కూడా సహకరించాలని కోరారు. గంజాయి గురించి సమాచారం అందితే తమకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.