TEJA NEWS

32 సంవత్సరాలు వెనక్కి వెళితే,
మద్రాసు మహానగరం లోని ఒక సాధారణమైన అద్దె ఇల్లు. ఒకప్పుడు లెక్కపెట్టకుండానే అడిగినవారికి లక్షల్లో దానం చేసిన ఆ ఇంట్లోని బంగారు చేతులు, రోజువారి జీతం కోసం ఎదురుచూస్తున్ననమ్మలేని రోజులు.
థడ్…థడ్…అని తలుపు చప్పుడు.
తెరిస్తే ఒక వ్యక్తి. ‘ఎవరు మీరు?’ అంటే, బదులుగా ‘మీ అభిమానిని అమ్మా!’ అని సమాధానం. లోపలికి తీసుకువచ్చి అన్నం పెట్టి కష్టసుఖాలు అడిగింది ఆ మహానుభావురాలు. తనది కిళ్ళీకొట్టు వ్యాపారం అనీ, ఇప్పుడంతా నష్టపోయానని చెప్పాడు ఆ అభిమాని.
తన దగ్గిర సమాయానికి డబ్బులు లేవు. ఒకప్పుడు బాగా బ్రతికి, పది మందిని బ్రతికించిన ఆమెకి ఊరికే పంపడమంటే ఏంటో తెలియదు. ఆలోచించింది. తన బీరువా గుర్తుకువచ్చింది. తనకి ఎంతో ఇష్టమైన రెండో మూడో పట్టుచీరెలని అందులో దాచుకుంది. ఇప్పుడే వస్తాను బాబూ అని వెళ్ళి ఒక చీరె తీసుకొని చేతులు వెనకపెట్టుకుని అతనికి కనపడకుండా బయటకి వచ్చింది. వీధి చివర తనకి తెలిసినవాడికి ఇచ్చి “అన్నయ్యా, దీన్ని అమ్మి ఎంత వస్తే అంత పట్టుకురా” అని చెప్పింది. తిరిగి లోపలికి వెళ్ళి అభిమానికి భోజనం వడ్డించింది. అరగంటకి ఆ ‘అన్నయ్య’ వచ్చి ఒక 5000 చేతిలో పెట్టాడు. ఆమె నవ్వుతూ అవి తీసుకొని లోపలకి వెళ్ళింది. కానీ ఆ చీరె విలువ ఆ రోజుల్లోనే 30,000. మిగతా పాతికవేలు ఆ అన్నయ జేబులోకి వెళ్ళాయి. ఆ విషయం తనకి తెలీదు. అంతెందుకు? తన జీవితంలో అసలు డబ్బులు ఎప్పుడూ లెక్కపెట్టలేదు అంటే నమ్ముతారా? ఇలా లెక్కలేనన్ని ఆర్ధిక అవకాశ రాబందులు తన జీవితంలో.
ఇలా ఎన్నున్నా, నటననే ప్రేమించింది కానీ ప్రేమని మాత్రం నటించలేదు.
ఆమె కనురెప్పలే కోటి భావాలు పలికేవి.
మహానటులుకు సైతం ఆమె పక్కన నటించడానికి చెమటలు పట్టేవి.
తెలుగువారు సగర్వంగా చెప్పుకునే ‘ఆడతనం’ ఆమెది.
30 సంవత్సరాల తన సుదీర్ఘ ప్రస్థానంలో మామూలు నటులు ఎప్పటికీ మోయలేని కిరీటాలని తను చిటికనవేలుతో ఆడించి చూపించింది.
పాత్రలే తనకోసం ఎదురుచూసేవి.
‘దేవదాసు’ లో విరహాన్ని పొంగించే ఆ కళ్ళు ‘మాయాబజార్’ లో ఠీవిని పలికించాయి. ఆ కళ్ళే దక్షిణభారతాన్ని అందంగా మోసం చేశాయి. అది నటన కాదు, జీవం అని మనల్ని మరిపించి మురిపించాయి.
ఆ కళ్ళే SVR, MGR, Sivaji Ganeshan, NTR, ANR, Amitabh, Rajnikanth, Kamal haasan లాంటి వారు కూడా ఆమె నటనకి పాదాభివందనం చేసేట్టు చేశాయి.


TEJA NEWS