TEJA NEWS

గీతలు పడితే విష వాయువులు, రసాయనాలు వెలువడే ప్రమాదం

ఒక్క గీత నుంచి 9 వేల మైక్రోప్లాస్టిక్‌ రేణువులు: ఐసీఎంఆర్‌

న్యూఢిల్లీ :

నాన్‌స్టిక్‌ వంటపాత్రలతో తీవ్రమైన ఆరోగ్యసమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌’ (ఐసీఎమ్మార్‌) హెచ్చరించింది.

నాన్‌స్టిక్‌ వంటపాత్రలపై చిన్న గీత పడినా దాని మీద ఉన్న టెఫ్లాన్‌ పైపూత (కోటింగ్‌)లో నుంచి విష వాయువులు, హానికారక రసాయనాలు వెలువడి ఆహారంలో కలుస్తాయని తెలిపింది.

ఒక్క గీత నుంచి కనీసం 9,100 మైక్రోప్లాస్టిక్‌ రేణువులు విడుదలవుతాయని పేర్కొంది. గీతలు పడిన నాన్‌స్టిక్‌ వంటపాత్రల్లో 170 డిగ్రీల సెల్సియస్‌ కన్నా అధిక ఉష్ణోగ్రత వద్ద వంట చేసినప్పుడు ఈ ప్రమాదం ఉందని తెలిపింది. కడిగేటప్పుడు నాన్‌స్టిక్‌ పాత్రలపై బోలెడన్ని గీతలు పడుతుంటాయి. ఈ లెక్కన వీటి నుంచి కొన్ని లక్షల మైక్రోప్లాస్టిక్స్‌ విడుదలయ్యే ప్రమాదం ఉంది.

వీటి వల్ల హార్మోన్లలో అసమతుల్యత, క్యాన్సర్‌, సంతానోత్పత్తి సమస్యలు వంటివి తలెత్తవచ్చని ఐసీఎమ్మార్‌ పేర్కొంది. నాన్‌ స్టిక్‌ వంటపాత్రల బదులు మట్టిపాత్రల్లో వండుకోవటం అత్యంత సురక్షితమని తెలిపింది. మరో ప్రత్యామ్నాయంగా గ్రానైట్‌ పాత్రలను కూడా సూచించింది. అయితే, వాటిపై ఎటువంటి రసాయన పూతలు ఉండవద్దని పేర్కొంది. ఫుడ్‌ గ్రేడ్‌ స్టెయిన్‌లెస్ స్టీల్‌ పాత్రలు కూడా మంచివేనని తెలిపింది. ‘భారతీయులకు ఆహార మార్గదర్శకాలు’ పేరుతో ఐసీఎమ్మార్‌ ఈ సూచనలను ఇటీవల విడుదల చేసింది*


TEJA NEWS