TEJA NEWS

నేపాల్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు..

వరదలు, కొండ చరియలు విరిగిపడి 14మంది మృతి

నేపాల్‌లో రుతుపవనాల రాకతోనే వినాశనం మొదలైంది. నేపాల్‌ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జనజీవితం స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. పిడుగుల వర్షానికి తోడు వరదలు బీభత్సం సృష్టించాయి. ఆ దేశవ్యాప్తంగా 24 గంటల్లో 14 మంది మరణించారు. హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డిఆర్‌ఎంఎ) రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతోంది

నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాలు దేశానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ వర్షాల వల్ల చాలాచోట్ల కరెంట్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. ఇక ఇప్పటివరకు కొండచరియలు విరిగిపడి ఎనిమిది మంది, పిడుగుపాటు కారణంగా ఐదుగురు, వరదల కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క్ లామ్‌జంగ్‌లో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి చెందడంతో అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవించాయి. జూన్ 26, 2024న రుతుపవనాల సీజన్ ప్రారంభమైనప్పటి నుండి, మొత్తం 28 మంది మరణించినట్లు నేపాల్ హోం మంత్రిత్వ శాఖ రికార్డులు చెబుతున్నాయి.

భారీ వర్షాలకు మేలంచి, ఇంద్రావతి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అటు కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఒక్కసారిగా ముంచెత్తిన వరదతో.. స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షాలకు ఒక్కసారిగా నదులు ఉప్పొంగగా.. కొండచరియలున్న ప్రాంతాల్లో వరద ఉధృతి ఎక్కువగా కనిపించింది.


TEJA NEWS