TEJA NEWS

హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్‌‌సాగర్‌‌లో నిర్మాణాలేనా..

హైదరాబాద్,

చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు నేలకూలాయి. ప్రస్తుతం కొద్ది రోజులు నిర్మాణాల కూల్చివేతకు గ్యాప్ తీసుకున్న హైడ్రా మళ్లీ విజృంభించేందుకు సిద్ధమైంది. హైడ్రా నెక్ట్స్‌ ఫోకస్ హుస్సేన్ ‌సాగర్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలే. ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన థ్రిల్ సిటీ, జలవిహార్ పై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జలవిహార్‌ను కూల్చి వేయాలంటూ హైడ్రాకు సీపీఐ జాతీయ నేత, మాజీ ఎంపీ అజీజ్ పాషా ఫిర్యాదు చేశారు.

హుస్సేన్‌సాగర్‌ను కబ్జా చేసి శాశ్వత నిర్మాణాలు చేపట్టిన జలవిహార్ పై చర్యలు తీసుకోవాలంటు డిమాండ్‌లు భారీగా వినిపిస్తున్నాయి. జలవిహార్ ఆక్రమణకు సంబంధించిన పూర్తి వివరాలను హైడ్రా కమిషనర్‌కు సీపీఐ నేతలు అందజేశారు. హుస్సేన్ సాగర్ ఎఫ్‌టఎల్, బఫర్ జోన్ పరిధిలో 12.5 ఎకరాల్లో జలవిహార్ ఏర్పాటు అయ్యింది. హుస్సేన్ సాగర్ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధి జలవిహార్ నిర్మాణాన్ని వ్యతిరికిస్తూ ఫోరమ్ ఫర్ బెటర్ హైదరాబాద్ కోర్టును ఆశ్రయించింది.

2007 లో జలవిహార్ ప్రారంభమైంది. జలవిహార్‌కు అప్పటి ప్రభుత్వం 30 ఏళ్ళు లీజ్‌కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. జలవిహార్‌లో వాటర్ పార్క్, ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. సందర్శకుల ద్వారా వచ్చే డబ్బులు, ఫంక్షన్ హాల్స్ ద్వారా కోట్ల రూపాయలను జలవిహార్ అర్జిస్తోంది. జలవిహార్ వ్యర్ధాలు అన్ని హుస్సేన్ సాగర్‌లోకే వెళతాయి. ఈ క్రమంలో జలవిహార్‌కు సంబంధించి ఫిర్యాదుల వెల్లువెత్తిన నేపథ్యంగా హైడ్రా నెక్ట్స్‌ టార్గెట్‌గా జలవిహారం నిలిచింది.


TEJA NEWS