TEJA NEWS

ISRO: ఈ నెల 18న మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో

పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగానికి రెడీ అవుతున్న ఇస్రో
రీశాట్-1బీ శాటిలైట్ ను కక్ష్యలో ప్రవేశపెట్టనున్న ఇస్రో

సైనిక దళాలకు వ్యూహాత్మకంగా ఉపయోగపడనున్న రీశాట్-1బీ

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సన్నద్ధమవుతోంది.

తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) వేదికగా ఈ నెల 18వ తేదీ ఉదయం 6.59 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ61 వాహకనౌకను ప్రయోగించనున్నారు. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి జరగనున్న ఈ ప్రయోగం ద్వారా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న భూ పరిశీలన ఉపగ్రహం ‘రీశాట్-1బీ’ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శాస్త్రవేత్తలు చురుగ్గా పూర్తి చేస్తున్నారు.

ఈ రీశాట్-1బీ ఉపగ్రహంలో అమర్చిన సీ-బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ (సార్) దీని ప్రధాన ప్రత్యేకత. ఈ రాడార్ సాయంతో పగలు లేదా రాత్రి అనే తేడా లేకుండా, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా భూ ఉపరితలాన్ని అత్యంత స్పష్టతతో కూడిన (హై-రిజల్యూషన్) చిత్రాలను తీయగలదు. ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, ఈ ఉపగ్రహం అందించే సమాచారం భారత సైనిక దళాలకు అత్యంత వ్యూహాత్మకంగా ఉపయోగపడనుంది.

దేశ భద్రత, ముఖ్యంగా సైనిక అవసరాలకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందించడంలో రీశాట్-1బీ కీలక పాత్ర పోషించనుంది. ఉగ్రవాదుల స్థావరాలు, వారి కదలికలను పసిగట్టడంతో పాటు, సరిహద్దు ప్రాంతాలలో శత్రు సైన్యాల కార్యకలాపాలను కూడా ఇది నిశితంగా పరిశీలించి, అధిక రిజల్యూషన్ ఛాయాచిత్రాలను అందించగలదు