Spread the love

అట్టడుగు వర్గాల ఆర్థిక పరిపుష్టికోసమే కూటమిప్రభుత్వం పీ-4 విధానానికి శ్రీకారం చుట్టింది : మాజీమంత్రి ప్రత్తిపాటి

సంపాదనాపరులైన ధనికులు, విద్యావంతులు, పారిశ్రామికవేత్తలు పీ-4లో భాగస్వాములై పేద, మధ్యతరగతి వర్గాలకు విద్య, వైద్యం, ఉపాధి పరంగా చేయూత అందించాలి : పుల్లారావు

ప్రభుత్వం ఉగాదినాడు ప్రారంభించబోయే పీ-4 విధానంతో పేదల జీవితాలు ఆర్థికంగా బాగుపడతాయని, అట్టడుగు వర్గాల ఆర్థిక పరిపుష్టికోసమే చంద్రబాబు దేశంలో ఎక్కడా లేని నూతన విధానాన్ని రాష్ట్రంలో ప్రారంభించబోతున్నారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సోమవారం ఆయన పట్టణంలోని 36, 37 వార్డుల్లో అధికారులు, కౌన్సిలర్లు ఏర్పాటు చేసిన పీ-4 విధివిధానాలకు సంబంధించిన వార్డుసభల నిర్వహణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీమంత్రి అక్కడ జరుగుతున్న పీ-4 లబ్ధిదారుల కుటుంబాల ఎంపికను స్వయంగా పరిశీలించి, సభను ఉద్దేశించి మాట్లాడారు. పేదరికం లేని సమాజం కోసం చంద్రబాబు ఏవిధంగా తపనపడుతున్నారో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని, మంచిమనసుంటే మార్గం ఉంటుందని ప్రత్తిపాటి సూచించారు. పూర్ టూ రిచ్ విధానం అంటే పేదల్ని ధనికుల్ని చేయడమేనని, దానికోసం ఆర్థికంగా స్థితిమంతులైన వారు పేదవర్గాలకు అవసరమైన విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు తమవంతు సహాయ సహాకారాలు అందించాలని పుల్లారావు కోరారు.

ప్రతి కౌన్సిలర్ తమ తమ వార్డుల్లోని పేద కుటుంబాల పూర్తిసమాచారం సేకరించాలని, ఆ వివరాలను.. ఆయా కుటుంబాల స్థితిగతులను అదేవార్డుల్లో ఉండే ధనికులు, పారిశ్రామికవేత్తలు, సామాజిక బాధ్యత ఉన్నవారికి తెలియచేసి, వారి సహాయసహాకారాలు పేద కుటుంబాలకు అందేలా చూడాలని పుల్లారావు సూచించారు. గ్రామ, వార్డు స్థాయి నుంచే ఈ చేయూత ప్రక్రియ ఒక పద్ధతి ప్రకారం జరగాలన్నారు. సంపాదనాపరులైన పారిశ్రామికవేత్తలు, విద్యావంతులు, ధనికులు సామాజిక సేవలో భాగస్వాములు కావాలని, కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీని బాధ్యతగా భావించి, రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ప్రత్తిపాటి కోరారు. సమర్థవంతమైన ప్రభుత్వం అధికారంలో ఉన్నందున రాష్ట్ర భవిష్యత్ గురించి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, జనసేన ఇన్చార్జి తోట రాజా రమేష్, వైస్ చైర్మన్ గోల్డ్ శ్రీను, టీడీపీ నాయకులు షేక్ టీడీపీ కరీముల్లా, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పఠాన్ సమాధ్ ఖాన్, మద్దుమలా రవి, కౌన్సిలర్ లు, మున్సిపల్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.