సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కామెంట్స్…
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. గుట్టలను మట్టిచేసి భూదాహం తీర్చుకోవడం కాదని.. గుట్టల్లా పేరుకుపోయిన ధాన్యం రాశుల వైపు చూడాలన్నారు. గాలిమోటర్లో మూటలు మోసుడు కాదని.. కొనేవారు లేక పేరుకుపోయిన ధాన్యం మూటల వైపు చూడాలని కామెంట్స్ చేశారు.
KTR: సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కామెంట్స్…
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ( ఎక్స్ ) వేదికగా విమర్శలు గుప్పించారు. ‘‘గుట్టలను మట్టిచేసి భూదాహం తీర్చుకోవడం కాదు రేవంత్ – గుట్టల్లా పేరుకుపోయిన ధాన్యం రాశుల వైపు చూడు.., గాలిమోటర్లో మూటలు మోసుడు కాదు – కొనేవారు లేక పేరుకుపోయిన ధాన్యం మూటల వైపు చూడు.., ఢిల్లీ ముందు మోకరిల్లడం కాదు – పండించిన పంటకు భద్రత లేక గొల్లుమంటున్న రైతన్నల మొహం వైపు చూడు.., నీ కల్లబొల్లిమాటలతో కాలయాపన చేయడం కాదు – ధాన్యం కొనడానికి ముందుకు రాని మిల్లర్ల ముచ్చటేందో చూడు.., నీ మూసి ముసుగులు కాదు – కల్లంలో కాంటా ఎప్పుడు వేస్తారో తెలియక కన్నీరు పెడుతున్న రైతన్నల కన్నీళ్ల వైపు చూడు.., పొద్దు, మాపు ఢిల్లీ యాత్రలు కాదు – పల్లె పల్లెల్లో, వాడ వాడల్లో వడ్లు కొనండి మొర్రో అంటూ మొత్తుకుంటున్న రైతు ఆవేదన వైపు చూడు.., నీ కాసుల కక్కుర్తి – నీ కేసుల కుట్రలు కాదు – పండిన పంటకు గిట్టుబాటు ధర దక్కక కకావికలం అవుతున్న రైతు బతుకు వైపు చూడు.., దొడ్డు వడ్లకు బోనస్ ఎగ్గొడితివి .. సన్నవడ్లకు సున్నం పెడితివి .. ఎగ్గొట్టడం మీద ఉన్న శ్రద్ధ రైతులకు ఆసరాగా నిలవడం వైపు చూడు’’ అంటూ కేటీఆర్ కామెంట్స్ చేశారు.
‘‘రియల్ ఎస్టేట్ రంగం గురించి నాకంటే ఎక్కువ ఎవరికి తెలియదని రేవంత్‌రెడ్డి చెప్పిండు.. సీఎం పదవంటే గుంపు మేస్త్రీ పోస్టు అన్నడు.. ఇప్పటివరకు నిర్మాణరంగానికి మేలు జరిగే ఒక్క నిర్ణయం తీసుకోలేదు. పక్కకు తీసుకెళ్లి మాట్లాడితే బిల్డర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు ఏడుపొక్కటే తక్కువ. వాళ్లు అధికారంలోకి వచ్చి 11 నెలలైంది. అభివృద్ధి ఎక్కడ.. రాష్ట్రంలో ఏంజరుగుతోంది.. 24 గంటల విద్యుత్తు సరఫరానూ అందించడంలేదు’’ అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రియల్టర్ల ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం శ్రీనగర్‌కాలనీలోని సత్యసాయినిగమాగమంలో నిర్వహించిన సమావేశంలో, ఆటో డ్రైవర్ల జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన మహాధర్నాలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘‘తెలంగాణ మీద అవగాహన లేని వారి అనాలోచిత చర్యలతో రాష్ట్రంలోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. హైడ్రా ఒక బ్లాక్‌మెయిల్ దుకాణం. సీఎం కుర్చీ కాపాడుకోవాలంటే.. ఢిల్లీకి పైసలు పంపాలి. పంపకపోతే వాడు ఊరుకోడు. హైడ్రా పేరు చెప్పి బిల్డర్లను పిలుస్తున్నడు. బెదిరిస్తున్నడు. అందుకే మార్కెట్ ఆగమాగం జగన్నాథం. ఎవ్వరి దగ్గరా పైసల్లేవు.. రేవంత్‌రెడ్డి, ఆయన అన్న వద్ద ఉండొచ్చు’’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. శక్తికి మించి పెట్టుబడులు పెట్టామని, తమ భూములు అమ్ముడుపోవడం లేదని, పరిస్థితి ఇలానే ఉంటే చిన్న బిల్డర్లు పూర్తిగా చితికిపోతారని, ఇటీవల తనను కలిసిన ఓ బిల్డర్ చెప్పారన్నారు. అనుమతులు తీసుకోవడమూ ఇప్పుడు బిల్డర్లకు కష్టంగా మారిందని, ప్రజల చేతుల్లో డబ్బులు లేకుండాపోయాయని, దీనికి కారణం ప్రభుత్వ తీరే అని విమర్శించారు. రైతుబంధు వేస్తే పన్నుల రూపంలో ఆ డబ్బు ప్రభుత్వానికే వస్తుందని, మార్కెట్లో లావాదేవీలు జరుగుతాయని అభిప్రాయపడ్డారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది బీఆర్‌ఎస్ అని రేవంత్‌రెడ్డికీ తెలుసని, తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతికార చర్యలంటూ పిచ్చి ఆలోచనలు చేయలేదని, సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టామని కేటీఆర్ చెప్పారు. గతంలో బంగారం, బ్యాంకు డిపాజిట్లు చేసే వర్గాలు భూమి మీద పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టాయని, ఇప్పుడు ఆ వర్గాల వాళ్లంతా ఆందోళన చెందుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఆ పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, నల్లగొండలో జరిగిన ఓ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముందు కొందరు నాయకులు అసహనం వ్యక్తం చేశారన్నారు. రియల్టర్ల ఇబ్బందులపై అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్ తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు. రెరాను సంప్రదిస్తూ లీగల్ ఓపినియన్ తీసుకొని రియల్టర్ల ఫోరం మరింత బలపడాలని కేటీఆర్ సూచించారు.
ఆటో డ్రైవర్లకు నెలకు రూ.5 వేలివ్వండి
‘‘అసెంబ్లీ ఎన్నికల ముందు హైదరాబాద్‌కు ప్రచారానికి వచ్చిన రాహుల్‌గాంధీ ఆటోలో అజారుద్దీన్‌తో కలిసి ప్రయాణించి డ్రైవర్లకు రంగుల కలలు చూపించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా.. ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది’’ అని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలోని 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారిందని, గతంలో ఖర్చులుపోను నిత్యం రూ.800 వరకు మిగలగా.. ఇప్పుడు రూ.200-300 గిట్టుబాటయ్యే పరిస్థితి కూడా లేదన్నారు. శాసనసభలో ఆత్మహత్యలు చేసుకున్న డ్రైవర్ల పేర్లతో సహ చెప్పామని, అయినా ప్రభుత్వం ఆదుకోలేదని మండిపడ్డారు. యేడాదికి రూ.12 వేలు ఇస్తామన్న హామీని ఇప్పటికీ నెరవేర్చలేదని, మానవీయ దృక్పథంతో ప్రతి నెలా ఆటో డ్రైవర్లకు రూ.5 వేలు ఇవ్వాలని కోరారు. ఎన్ని కేసులు పెట్టినా.. జైల్లో పెట్టినా.. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల కోసం పోరాడతామని కేటీఆర్ అన్నారు.