TEJA NEWS

కాంగ్రెస్‌-బిఆర్ఎస్ పవర్ పాలిటిక్స్ వేదికగా లగచర్ల?

సిఎం రేవంత్‌ రెడ్డి సొంత నియోజకవర్గంలో లగచర్లలో జిల్లా కలెక్టర్‌, సబ్ కలెక్టర్‌ తదితరులపై కర్రలు, రాళ్ళతో గ్రామస్తులు దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల మద్య మొదలైన రాజకీయాలలో ఏదో ఓ పార్టీ మూల్యం చెల్లించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

ముందుగా కాంగ్రెస్‌ వాదనలు చెప్పుకుంటే, బిఆర్ఎస్ పార్టీయే గ్రామస్తులను ఉసిగొల్పి ఈ దాడులు చేయించింది. ఆ పార్టీకి చెందిన సురేశ్ జిల్లా కలెక్టర్‌ వద్దకు వెళ్ళి, లగచర్లలో గ్రామస్తులు ఎదురుచూస్తున్నారని నమ్మించి తీసుకువెళ్ళాడు.

అప్పటికే అక్కడ రాళ్ళు, కర్రలతో సిద్దంగా ఉన్న గ్రామస్తులు వారిపై దాడి చేశారు. ఈ దాడి జరిగే ముందు బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సురేష్‌కి 42 సార్లు ఫోన్‌ చేసి మాట్లాడారు. దేనికి? అంటే బిఆర్ఎస్ పార్టీ దీని వెనుక ఉందని, ఓ పధకం ప్రకారమే ఈ దాడులు చేయించిందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. కనుక ఈ దాడి వెనుక ఎంత పెద్దవారున్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించడమే కాక నేడు పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు కూడా.

కేటీఆర్‌ ఏమంటున్నారంటే, “రేవంత్‌ రెడ్డి తన అల్లుడు సత్యనారాయణ రెడ్డి, అతని స్నేహితుడు శరత్ ఫార్మా కంపెనీ కోసమే ప్రశాంతంగా ఉన్న కొడంగల్లో ఈ చిచ్చు రగిలించారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడిన సురేష్ మా పార్టీకి చెందినవాడే.

అతను మా పార్టీ నేత పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడితే నేరం ఎలా అవుతుంది? ఆ లెక్కన రేవంత్‌ రెడ్డి కూడా తన అధిష్టానంతో, పార్టీ నేతలతో మాట్లాడటం తప్పేగా?

ఈ దాడి ఘటనలో మమ్మల్ని ఇరికించేందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓ ముందస్తు పధకంతో గన్‌మ్యాన్, సెక్యూరిటీ లేకుండా జిల్లా కలెక్టర్‌, సబ్ కలెక్టర్‌ తదితరులను అక్కడికి పంపించింది. తమ భూములు పోతాయనే ఆగ్రహావేశాలతో ఉన్న గ్రామస్తులు వారిపై దాడి చేస్తే, అది మేమే చేయించామని రేవంత్‌ రెడ్డి, మంత్రులు దుష్ప్రచారం చేస్తున్నారు,” అని అన్నారు.

జిల్లా కలెక్టర్‌, సబ్ కలెక్టర్‌పై దాడి జరిగితే కేటీఆర్‌ దానిని ఖండించకపోగా సమర్ధిస్తున్నట్లు మాట్లాడుతున్నారు. సెక్యూరిటీ లేకుండా అధికారులు గ్రామంలోకి వెళ్ళడం తప్పు అదో పెద్ద కుట్ర అన్నట్లు మాట్లాడుతున్నారు.

జిల్లా కలెక్టర్‌ తదితరులని లగచర్ల గ్రామానికి తీసుకువెళ్ళిన సురేష్ తమ పార్టీకి చెందినవాడే అని కేటీఆర్‌ అంగీకరించారు. దాడికి ముందు పట్నం నరేందర్ రెడ్డి అతనితో ఫోన్లో మాట్లాడటం తప్పు కాదని వాదించే ప్రయత్నంలో వారు ఫోన్లో మాట్లాడుకోవడం నిజమేనని కేటీఆర్‌ ధృవీకరించారు.

కనుక ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తొందరపాటుతో వ్యవహరించినప్పటికీ, కేటీఆర్‌ తన వాదనలతో ఈ కుట్ర వెనుక బిఆర్ఎస్ పార్టీ ఉందనే భావన కలిగించి పార్టీకి నష్టం చేసుకున్నారని చెప్పక తప్పదు.


TEJA NEWS