TEJA NEWS

దేశ డ్రోన్ రాజ‌ధానిగా ఏపీని తీర్చిదిద్దుతాం

ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులో డ్రోన్ హబ్ కోసం 300 ఎకరాలు కేటాయిస్తాం.

రాష్ట్రంలో 35 వేల మంది డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇవ్వాలన్నది మా లక్ష్యం

నాలెడ్జ్ ఎకాన‌మీలో డ్రోన్ స‌ద‌స్సు గేమ్ ఛేంజ‌ర్‌.

డేటా స‌రికొత్త సంప‌ద‌. ఏఐ, మెషీన్ లెర్నింగ్‌ల‌తో అనుసంధానంతో విప్లవాత్మక మార్పులు.

నిపుణులు, పారిశ్రామిక వేత్తల సూచన‌లు తీసుకొని 15 రోజుల్లోనే డ్రోన్ పాలసీని ఆవిష్క‌రిస్తాం.

2047 నాటికి ఒక కుటుంబం…ఒక పారిశ్రామిక‌వేత్త ఉండాలన్నది నా అభిమతం.

  • అమ‌రావ‌తి డ్రోన్ స‌ద‌స్సులో గౌర‌వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌రావ‌తి డ్రోన్ సమ్మిట్ నిర్వహించడం సంతోషంగా ఉంద‌ని.. ఇది భ‌విష్య‌త్తు నాలెడ్జ్ ఎకాన‌మీలో గేమ్ ఛేంజ‌ర్ అని ముఖ్య‌మంత్రి నారాచంద్ర‌బాబు నాయుడు అన్నారు. మంగ‌ళ‌వారం మంగ‌ళ‌గిరిలోని సీకే క‌న్వెన్ష‌న్స్‌లో కేంద్ర పౌర విమాన‌యాన శాఖ‌, ఏపీ డ్రోన్స్ కార్పొరేష‌న్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్‌ను కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు, రాష్ట్ర మౌలిక వ‌స‌తులు, పెట్టుబ‌డుల శాఖ మంత్రివ‌ర్యులు బీసీ జ‌నార్ధ‌న్ రెడ్డి త‌దిత‌రుల‌తో క‌లిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంత‌రం ఆయన మాట్లాడుతూ…1995లో నేను ఐటీ విధానం గురించి మాట్లాడితే ఆరోజు ఆ మాట‌లు కొంద‌రికి అర్థం కాలేదని.. సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఐటీ రంగాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని పెద్ద ఎత్తున ప్ర‌మోట్ చేసిన‌ట్లు తెలిపారు.

బెంగళూరులో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఐటీ కంపెనీల ఏర్పాటుకు గ‌తంలో పరిస్థితులు అనుకూలంగా ఉండేవ‌ని.. తాను వివిధ ఐటీ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి హైదరాబాద్‌కు ఐటీ పరిశ్రమలు తెచ్చేందుకు కృషిచేశానన్నారు. వాటి ఫ‌లిత‌మే నేడు హైద‌రాబాద్ ఐటీ రంగంలో అభివృద్ధి ప‌థంలో న‌డుస్తోంద‌ని తెలిపారు. పీపీపీ విధానంలో హైటెక్ సిటీని నిర్మించిన‌ట్లు తెలిపారు.

ఆ సమయంలో అమెరికాలో 15 రోజులు పాటు పర్యటించి అనేక మంది ఐటీ నిపుణులతో సంప్రదించి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరిన‌ట్లు తెలిపారు. ముఖ్య‌మంత్రి ఇంకా ఏమ‌న్నారంటే..

నాడు నేను ఒకటే చెప్పా… టెక్నాల‌జీలో ఇండియా బలమైన దేశమని. బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలివెళ్లేటప్పుడు దేశ సంపదతో పాటు కోహినూర్ వజ్రాన్ని తీసుకెళ్లారు. అయితే ఇంగ్లీష్‌ను వ‌దిలివెళ్లారు.

నేడు ప్రపంచంలోనే ఇంగ్లీష్ మాట్లాడేవారు ఇండియాలోనే ఎక్కువ మంది ఉన్నారు. గణితంలోనూ ఇండియా వారు బలమైనవారు. సున్నాను కనిపెట్టింది కూడా ఇండియా వారే.

బిల్ గేట్స్ ను కూడా గతంలో హైదరాబాద్ కు ఆహ్వానించి ఇక్కడి పరిస్థితులు వివరించాం. టెలీ కమ్యూనికేష‌న్‌లో డీ రెగ్యులేష‌న్ గురించి నాటి ప్రధాని వాజ్‌పేయ్ ని ఒప్పించాం. సెల్ ఫోన్ అన్నం పెడుతుందా అంటూ వెకిలిగా మాట్లాడారు. ఐటీ రంగంలో భారతీయులు బలమైనవారు. బయో టెక్నాలజీ, ఫార్మాలో భార‌తీయులు స‌మ‌ర్థ‌వంతులు.

టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో తెలుగు ప్రజలు ఎప్పుడూ ముందుంటారు. అడ్వాన్స్ డ్రోన్స్, సీసీటీవీ కెమెరాలు, యాప్‌లు, ఇతర టెక్నాలజీ పరికరాల వినియోగంలో ముందున్నాం. ఐటీ గురించి మాట్లాడిన సంద‌ర్భంలో ఉద్యోగాలు చేయడమే కాదు…ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్లాలని చెప్పాను.

ప్రపంచంలో భారతీయులు ఎక్కువ తలసరి ఆదాయం పొందుతున్నారు. అందులో తెలుగువారు 30 శాతం మంది ఉన్నారు.

విమాన సదుపాయం లేని సమయంలో ఢిల్లీ, ముంబైలో దిగి హైదరాబాద్ రావాలని చెప్పాను. వ్యాపారాలు చూసుకుని వెళ్లండని కోరాను…దానికి కారణం హైదరాబాద్‌కు నాడు సరైన విమాన సదుపాయం లేకపోవ‌డ‌మే.

నాటి ప్రధాని వాజ్‌పేయిని ఒప్పించి ఓపెన్ స్కై పాలసీ తెచ్చేలా కృషి చేశాం. అప్పుడు మొదటి సారి ఎమిరేట్స్ నుండి హైదరాబాద్ విమానం నడిచింది. ఆ సమయంలోనే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు శ్రీకారం చుట్టాం. 32 సార్లు ప్రధానమంత్రి, విమానయాన శాఖ అధికారులతో చర్చించాం.


TEJA NEWS