TEJA NEWS

వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు చూసొద్దాం

** ధ్వజారోహణంతో ఉత్సవాలు ఆరంభం

తిరుపతి: టీటీడీకి అనుబంధంగా తిరుపతి నుంచి 40 కి.మీ. దూరంలోని కార్వేటినగరంలో వెలసిన శ్రీ రుక్మిణి – సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం మిథున లగ్నంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల మధ్య గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించి ధ్వజారోహణం వైభవంగా నిర్వహించారు.
అంత‌కుముందు ఉద‌యం 5.30 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు ధ్వజప్రతిష్ఠ, రక్షాబంధనం, భేరీతాడనం, నవసంధి, బలిహారణం, తిరుమాడ వీధి ఉత్సవం సాగింది. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ధ్వజపటం, చక్రత్తాళ్వార్‌, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ముందుగా పర్యవేక్షించి, 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారని ప్రతీతి. సోమవారం రాత్రి 7 నుంచి 9 గం.ల వ‌ర‌కు స్వామివారు పెద్ద శేష వాహ‌నంపై విహ‌రించి భ‌క్తుల‌ను అనుగ్ర‌హించారు.

స్థల పురాణం: ఆకాశరాజు కుమార్తె పద్మావతీ దేవితో కలియుగ దైవం శ్రీనివాసుల పరిణయానంతరం ఆకాశరాజు స్వర్గస్థుడు కాగా, అతని కుమారుడు వసుదాసుడు సంతానహీనుడై తమ పూర్వులకు అర్థరాజ్యం ఇచ్చిన నారాయణరాజు మునిమనుమడైన వేంకటరాజునకు నారాయణపుర రాజ్యమును అప్పగించి తాను వేంకటాచలమున తపస్సుచేసి శ్రీనివాసుని పాదారవిందముల ప్రాప్తి పొందగోరెను. వేంకటరాజు వంశమున వేంకట పెరుమాళ్రాజు తన పరిపాలన కాలమందు ఈ కార్వేటినగర నిర్మాణమును గావించి తిరుమలలో శ్రీ వేంకటాచలపతితో కూడి పూజింపబడుచున్న శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి దేవతామూర్తులను తెప్పించి శ్రీ వేఖానసులవారిచే ప్రతిష్టింపజేసెను. ఈ ఆలయ నిర్వహణను రాజుల పరిపాలనానంతరం 1936 సంవత్సరం నుంచి దేవాదాయ శాఖ నిర్వహించి, తదుపరి 1989 ఏఫ్రిల్ 10న తిరుమల తిరుపతి దేవస్థానమునకు అప్పగించబడినది. ఈ ఆలయంలో స్వామివారు సంతాన వేణుగోపాల స్వామిగా ఎంతో ప్రసిద్ధి పొందినారు. కాగా సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆల‌య డిప్యూటీ ఈవో బి. నాగరత్న, ఆలయ అర్చకులు తరణ్ కుమార్, గోపాలా చార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ జీ.సురేష్‌ కుమార్, పలువురు భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. 28న మధ్యాహ్నం 1.30 నుండి 3.30 గంట‌ల వ‌ర‌కు పుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.