టీనేజ్ అమ్మాయికి నల్లకోటు వేసినట్టు ఉన్న ఈ అమాయకపు అమ్మాయిని చూడండి. పేరు శ్రీపతి… చెన్నై నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువన్నామలై దగ్గరి జువ్వాది పర్వతశ్రేణుల మధ్య గిరిజన గూడెం వాళ్ళది. తండ్రి కాళిదాస్ , తల్లి మల్లిగ కొండప్రాంతంలో పోడు వ్యవసాయం చేసేవాళ్ళు… శ్రీపతి కి చెల్లెలు, తమ్ముడు ఉన్నారు.
పిల్లల చదువుకోసం ఆ కుటుంబం దగ్గరలోని అత్నవర్ పల్లెకు వలస వచ్చింది. ఇక్కడా పోడు వ్యవసాయం అయినా పిల్లలు చదువుకోడానికి మంచి స్కూల్ ఉందని సంతోషించారు. కాళిదాస్ టూరిస్ట్ ప్రదేశాల్లో హౌజ్ కీపింగ్ లాంటి పనులకు కుదురుకున్నాడు.
వాళ్ళది ‘మలయలి’ అనే అత్యంత వెనుకబడిన గిరిజన తెగ… ఆ తెగలో అమ్మాయిలను చదివించడం, బయటకు పంపడం పట్ల అనేక ఆంక్షలు ఉంటాయి. కాళిదాస్, మల్లిగ దంపతులు వీటిని ఏమీ పట్టించుకోలేదు. శ్రీపతి చదువులో ముందు ఉండడం, ఉన్నత చదువులు చదువుతాను అని పట్టుబట్టడంతో ఆమెను తిరువన్నామలైలో లా కోర్సు చదివించారు.
బంధువుల ఒత్తిడి కారణంగా శ్రీపతికి వెంకట్రామన్ అనే యువకుడితో వివాహం జరిపించారు. పెళ్ళైనా శ్రీపతి చదువు ఆపలేదు. Dr. అంబేడ్కర్ లా విశ్వవిద్యాలయంలో పీజీ చేసింది. వెంటనే జూనియర్ సివిల్ జడ్జ్ పరీక్షకు అప్లై చేసింది. అయితే పరీక్షకు అప్లై చేసేనాటికే తాను గర్భవతిని అని తెలిసింది. సరిగ్గా పరీక్ష తన డెలివరీ ఒకేసారి అయ్యేలాగ ఉందని ఆందోళన చెందింది. అయితే తల్లిదండ్రులు, తన ఫేవరెట్ టీచర్ మహాలక్ష్మి , భర్త వెంకట్రామన్ ధైర్యం చెప్పారు. చదువుకోవడం పట్ల దృష్టి పెట్టు అంతా మంచే జరుగుతుందని సర్ది చెప్పారు.
శ్రీపతి తదేక దీక్షతో పరీక్షలకు చదివింది. తల్లి మల్లిగ అనుక్షణం శ్రీపతి ఆరోగ్యం కనిపెట్టుకుని ఉంది. పరీక్ష డేట్ వచ్చేసింది. డెలివరీకి వెళ్ళేముందు కూడా పుస్తకాలు వదలలేదు శ్రీపతి.
నవంబర్ 27 న శ్రీపతి చక్కటి పాపకు జన్మనిచ్చింది. నవంబర్ 29 న పరీక్ష. రెండ్రోజుల బాలింత పరీక్ష 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నైలో… అయినాసరే పరీక్ష రాస్తానని పట్టుబట్టింది. డాక్టర్లు వారించినా వినలేదు. తన శ్రమ వృధా కాకూడదని వేడుకుంది. తల్లిదండ్రులు భర్త సహకారంతో పసిగుడ్డుతో ప్రయాణం చేసి పరీక్ష వ్రాసింది. సెలెక్ట్ అయ్యింది. TNPSCలో ఇంటర్వ్యూ కు అటెండ్ అయ్యింది. ఫిబ్రవరి 15, 2024 నాడు జూనియర్ సివిల్ జడ్జ్ గా, మొట్టమొదటి గిరిజన మహిళగా అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకుంది…
అకుంఠిత దీక్షతో, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ధైర్యంగా తట్టుకొని చదివి , విజయాన్ని అందుకున్న ఈ బంగారు తల్లి శ్రీపతి విజయగాధ ఆమెలాంటి వందల మందికి ఆదర్శం.
మరో సారి జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీపతి మేడం కు శుభాకాంక్షలు…