Spread the love

మంగళగిరిలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించాం

ఉగాది తర్వాత మొదటి విడతగా 5వేల మందికి ఇళ్ల పట్టాలు!

స్వర్ణకారులను ఆదుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం

మంగళగిరిలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తాం

యర్రబాలెంలో ఆధునీకరించిన శ్రీ భగవాన్ మహవీర్ గోశాలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

మంగళగిరిః మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించామని, 100 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామంలో ఆధునీకరించిన శ్రీ భగవాన్ మహవీర్ గోశాలను, నూతన సముదాయాలను మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. శ్రీ భగవాన్ మహవీర్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. గోపాలమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. జైన్ సోదరులు యర్రబాలెం గ్రామంలో గత 25 ఏళ్లుగా గోశాల నిర్వహిస్తున్నారు. రెండు ఆవులతో మొదలైన గోశాల 450 ఆవులకు చేరింది. వారికి అండగా నిలబడేందుకు, వారిని ప్రోత్సహించేందుకు, వారు చేస్తున్న మంచి కార్యక్రమాలను చూసేందుకు నేను, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడకు రావడం జరిగింది. జైన్ సోదరులు చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మంగళగిరిలో ఆవులన్నీ రోడ్లపై తిరిగే పరిస్థితి. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగాయి. ఓ వైపు శ్రీ భగవాన్ మహవీర్ గోశాల, మరోవైపు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా గోశాలను తిరిగి ప్రారంభించడం జరిగింది. మంగళగిరి పట్టణంలో ఆవులు వీధుల్లో తిరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. గోశాలలు పెడితే బాగుంటుందనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది.

మంగళగిరిలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించాం

మంగళగిరి నియోజవర్గంలో భారీ మెజార్టీతో గెలిపించాలని ఎన్నికల సమయంలో కోరాను. అప్పుడే అభివృద్ధికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. ఏపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మంగళగిరిలో నాకు మెజార్టీ ఇవ్వడం జరిగింది. రాష్ట్రస్థాయిలో మూడో అత్యధిక మెజార్టీ సాధించాను. ప్రజలు నన్ను దీవించారు. నా గౌరవం నిలబెట్టారు. వారికి నేను రుణపడి ఉంటాను. మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది.

మొదటి విడతలో 5వేల మందికి ఇళ్ల పట్టాలు అందిస్తాం

ప్రభుత్వ, కొండ పోరంబోకు, చెరువు, రైల్వే భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి ఇంటిపట్టాల కోసం ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. నిన్న గురువారం మొదటి పట్టా ఇప్పటంలో జనరేట్ అయింది. మొదటి విడతలో సుమారుగా 5వేల మందికి ఉగాది తర్వాత ఇళ్ల పట్టాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాం. రెండో విడత, మూడో విడతలో మిగిలిన ఇళ్ల పట్టాలు అందిస్తాం. కాలువలు, అటవీ భూముల్లో ఇళ్ల పట్టాలకు కొంత సమయం పడుతుందని ఆనాడే చెప్పాను. కేంద్రమంత్రి పెమ్మసాని సహకారంతో రైల్వే మంత్రి గారిని కలిసి రైల్వే భూములు క్రమబద్ధీకరించాలని కోరినప్పుడు సానుకూలంగా స్పందించారు. ఇందుకు పెమ్మసాని కృషి ఎంతో ఉంది. నిడమర్రు గేటువద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి విషయంలో కూడా పెమ్మసాని గారు చొరవ తీసుకున్నారు. త్వరలో పనులు ప్రారంభించబోతున్నాం. ఇళ్ల పట్టాల విషయంలో మహానాడు ప్రాంతంలో రీటైనింగ్ వాల్ నిర్మించాలని ప్రజలు కోరారు. ఇప్పటికే నిధులు కేటాయించాం. డిజైన్ పనులు జరుగుతున్నాయి. 4 లైన్ల రోడ్డు కూడా నిర్మిస్తాం.

నియోజకవర్గంలో 100 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం

పార్క్ లు, చెరువులు, స్మశానాలు, కమ్యూనిటీ భవనాలు, రైతు బజార్లు, బీసీ, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి.. ఇలా దాదాపు 100 అభివృద్ధి కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని డిజైన్లు పూర్తయ్యాయి. టెండర్ దశకు వచ్చాయి. ఏప్రిల్, మే మాసంలో పూర్తిచేసి భూగర్భ డ్రైనేజీ, అండర్ వాటర్ పైప్ లైన్, గ్యాస్, పవర్ కూడా ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఏపీలో ఎన్నడూ జరగనివిధంగా పనులు చేస్తాం.

స్వర్ణకారులను ఆదుకుంటాం

మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యూయలరీ పార్క్ ఏర్పాటుచేస్తాం. భూములు కూడా పరిశీలించడం జరిగింది. డిజైన్ వర్క్ జరుగుతోంది. స్వర్ణకారులను ఆదుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. వారికోసం కార్పోరేషన్ ఏర్పాటుచేశాం. ఈ బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించడం జరిగింది. స్వర్ణకారులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. పట్టాలు అందించిన తర్వాత ఇళ్లు లేని వారికి జీప్లస్-3 విధానంలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని చంద్రబాబు గారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేంద్రంలో మోడీ, కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి , ఉపముఖ్యమంత్రి పవనన్న, నేను కలిసికట్టుగా మంగళగిరి అభివృద్ధి కోసం కష్టపడతాం. ప్రజలకు ఇచ్చిన హామీలను పద్ధతిప్రకారం నెరవేరుస్తాం. ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్న చోట సొంత నిధులు ఇచ్చి అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతోంది.

మంగళగిరిలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తాం

మంగళగిరిలో ట్రాఫిక్ సమస్యను 8 నుంచి 12 నెలల్లో పరిష్కరిస్తాం. సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తిచేసిన తర్వాత ఈ-11, ఈ-13, వెస్ట్రన్ బైపాస్ ను జాతీయ రహదారికి అనుసంధానిస్తాం. సీతానగరంలో రీటైనింగ్ వాల్, 4లైన్ల రోడ్డు నిర్మిస్తాం. కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ట్రాఫిక్ మేనేజ్ మెంట్ డిజైన్ రూపొందిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ ప్రసాదం కార్యక్రమం కింద మంగళగిరిలో లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాలను అభివృద్ధి చేస్తాం. మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. వారణాసిని స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తాం. ప్రస్తుతం ప్రణాళిక దశలో ఉన్నాం. రోడ్లు, వసతి సౌకర్యం కల్పించడంతో పాటు ఆడిటోరియం నిర్మిస్తాం.

కక్షసాధింపులు ఉండవు

కూటమి ప్రభుత్వంలో కక్షసాధింపులకు పాల్పడటం లేదు. చట్టాలను ఉల్లంఘించిన వారిపైనే చర్యలు తీసుకుంటాం. తప్పుచేసిన వారిన ఎవరినీ వదిలిపెట్టేది లేదు. వీసీల నియామకంలో పారదర్శకంగా వ్యవహరించాం. గతంలో తప్పుచేసిన వీసీలను వదిలిపెట్టం. గత వైసీపీ ప్రభుత్వం అమరావతిని సర్వనాశనం చేసింది. డీవాటరింగ్ కే మాకు సమయం పట్టింది. అమరావతిలో పనులకు సంబంధించి టెండర్లు పూర్తయ్యాయి. ఏప్రిల్ లో పనులు ప్రారంభిస్తాం.

కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు దుగ్గిరాల కోల్డ్ స్టోరేజీలో పసుపు దగ్ధంతో రైతులకు రూ.40 కోట్ల నష్టం కలిగింది. వచ్చే రెండు వారాల్లో పసుపు రైతులకు పరిహారం అందిస్తామన్నారు. ఎయిమ్స్ ఆసుపత్రి సామర్థ్యాన్ని 60శాతం నుంచి 100శాతానికి పెంచుతామని చెప్పారు.

జైనులకు అండగా నిలబడతాం:మంత్రి లోకేష్

అంతకుముందు గోశాల నిర్వాహకులు ఏర్పాటుచేసిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. గోసేవ చేస్తే దేవుడికి సేవచేసినట్లే. కనిపించే దైవం గోమాత. గోసంరక్షణ అనేది మనందరి బాధ్యత. నేను మంత్రి అయిన తర్వాత మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గోశాలను తిరిగి ప్రారంభించాం. ఆవు పాలు చాలా ఆరోగ్యకరం. శ్రీ భగవాన్ మహవీర్ గోశాల ఆధ్వర్యంలో మరో రెండు గోశాలలను ప్రారంభించడం ఆనందంగా ఉంది. అందరం కలిసికట్టుగా గోసంరక్షణకు కృషిచేద్దామని చెప్పడం చాలా మంచి మాట. దానిని ఆచరణలో పెట్టడం అభినందనీయం. కూటమి ప్రభుత్వంలో గోసంరక్షణకు కృషిచేస్తున్నాం. గోకులం, గోశాలలను పెద్దఎత్తున ఏర్పాటుచేయాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం జైనులకు అండగా నిలబడుతుంది. మీరు అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సేవ మీ రక్తంలోనే ఉంది. మీకు అండగా నిలబడాల్సిన బాధ్యత తమపై ఉందని, జైనులకు ఏ సమస్యలున్నా పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు. కార్యక్రమం అనంతరం మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.