TEJA NEWS

ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం ఇంద్రవెల్లి స్థూపం వద్ద నిర్వహించిన సంస్మరణ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమరవీరులకు నివాళి అర్పించి, సంప్రదాయ పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. 44 ఏళ్ల క్రితం జరిగిన ఘటనలో ఎందరో ఆదివాసీ బిడ్డలు అమరులవడం దురదృష్టకరమన్నారు.

వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు కృషి చేస్తామని చెప్పారు.ఇందులో భాగంగానే అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజున అమరుల కుటుంబాలకు ట్రైకార్‌ ఆధ్వర్యంలో ట్రాక్టర్లు, ఇతర వాహనాలను అందించామని తెలిపారు. ఇంద్రవెల్లిలో రూ.కోటితో స్మృతివనం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఇంద్రవెల్లి పోరాటంలో 15 మంది అమరులయ్యారని ఆనాటి ప్రభుత్వాలు నిర్ధారించాయని, వాస్తవంగా ఆ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుందని పేర్కొన్నారు. వారి వివరాలను ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో గుర్తించి, ఆ కుటుంబాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.