TEJA NEWS

అత్యధికంగా పటాన్ చెరు సెగ్మెంట్లో 4,10,170 ఓటర్లు
ప్రధాన పార్టీల అభ్యర్థుల మూలాలు ఇక్కడే
గెలుపోటముల డిసైడింగ్వీరిదే..
సంగారెడ్డి, : మెదక్ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థుల గెలుపోటములపై పటాన్ చెరు అసెంబ్లీ సెగ్మెంట్ ప్రభావం చూపనుంది.
సంగారెడ్డి, మెదక్, నర్సాపూర్, గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల కంటే పటాన్ చెరు సెగ్మెంట్ లో అత్యధిక ఓటర్లు నమోదై ఉన్నారు. పైగా మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులకు పటాన్ చెరుతో సంబంధం ఉండడమే కాకుండా వారి మూలాలు ఇక్కడే ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, కాంగ్రెస్ క్యాండిడేట్ నీలం మధు, బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పటాన్ చెరు నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ సెగ్మెంట్ ఇండస్ట్రియల్ ఏరియా కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ఇక్కడే స్థిరపడుతుండడంతో ఓటర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇందులో ఎక్కువగా ఉద్యోగులు, కార్మికులే ఉండడంతో అభ్యర్థులు వారిపైనే ఫోకస్ పెట్టి ప్రచారాస్త్రాలు సంధిస్తున్నారు.

ఓటర్లు 4,10,170 మంది

జనవరిలో విడుదల చేసిన ఓటర్ జాబితా ప్రకారం పటాన్ చెరు అసెంబ్లీ సెగ్మెంట్ లో 4,10,170 ఓటర్లు ఉన్నారు. మిగతా 6 నియోజకవర్గాలతో పోలిస్తే ఓటర్ల సంఖ్య ఇక్కడ ఎక్కువగా ఉంది. మెదక్ ఎంపీగా ఎవరు గెలవాలన్నా పటాన్ చెరు ఓటర్లే కీలకమవుతున్నారు. ఈ క్రమంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎక్కువగా పటాన్ చెరు, తెల్లాపూర్, అమీన్పూర్, ఇస్నాపూర్, రుద్రారం, గుమ్మడిదల, జిన్నారం ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులు నేరుగా ఇంటింటికీ తిరిగి ఓట్లు అడిగే పరిస్థితి లేకపోవడంతో ప్రధాన కూడళ్లు, కాలనీలు, అపార్ట్మెంట్ల పరిధిలో ఉండే ఓటర్లను కలుస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. పార్టీలోని సెకండ్ క్యాడర్ లీడర్లు, కార్యకర్తలు క్యాండిడేట్ల తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పటాన్ చెరు నియోజకవర్గ ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తారనేది ఆసక్తిగా మారింది.

ఆ ముగ్గురు ఇలా..

మెదక్ లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచిన మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులకు పటాన్ చెరు అసెంబ్లీ సెగ్మెంట్ తో సత్సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు స్వగ్రామం పటాన్ చెరు మండలం చిట్కుల్. ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా మధు ఏకగ్రీవంగా ఎన్నికై స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మంచి ఇమేజ్సంపాదించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పి నుంచి పోటీ చేసినప్పటికీ వ్యక్తిగత ఇమేజ్ తో 40 వేల పైచిలుకు ఓట్లు సాధించి కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపించారు.

ఈ క్రమంలోనే సర్పంచ్ నుంచి ఎంపీగా పోటీ చేసే స్థాయికి ఎదిగారు.

బీఆర్ఎస్ క్యాండిడేట్ వెంకట్రామిరెడ్డి సంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేసి పటాన్ చెరు ఓటర్లకు సుపరిచితుడిగా ఉన్నారు. పైగా ఇతను ఇదే నియోజకవర్గంలోని తెల్లాపూర్ లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకొని స్థానిక పొలిటికల్ లీడర్లతో సంబంధాలు కలిగి ఉన్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విషయానికి వస్తే ఆయన రాజకీయ ప్రస్థానం పటాన్ చెరు నుంచే మొదలైంది. పాత్రికేయుడిగా, న్యాయవాదిగా పనిచేయడంతో ఆయనకు స్థానికంగా పరిచయాలు బాగానే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం టైంలో పటాన్ చెరు నుంచి రాజకీయలు చేసి దుబ్బాక ఎమ్మెల్యేగా ఎదిగారు. అయితే వీరిని పటాన్ చెరు నియోజకవర్గ ఓటర్లు ఏ మేరకు ఆదరిస్తారనేది తెలియాల్సి ఉంది.


TEJA NEWS