
మీ దేశ బడ్జెట్ మొత్తం మా సైనిక బడ్జెట్ తో సమానం కాదు: ఓవైసీ
హైదరాబాద్:
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో టూరిస్టులపై ఉగ్రవాద దాడి తర్వాత దాయాది దేశం పాకిస్తాన్ పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు.
పాకిస్తాన్ సర్కార్, దాని నిఘా సంస్థ ISI యొక్క అక్రమ సంతానమే ఉగ్రవా ద సంస్థ లష్కరే తోయిబా అని ఆరోపించారు. పాక్ ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రే లిస్ట్‌లో ఉంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇక, భారత్ పై అణు బాంబులు వేస్తామని హెచ్చరించిన పాక్ మంత్రిపై ఒవైసీ విరుచుకుపడ్డారు. గుర్తుంచుకోండి, కేవలం అరగంట వెనుకబడి లేరు, భారతదేశం కంటే అర్ధ శతాబ్దం వెనుకబడి ఉన్నారు అని ఎద్దేవా చేశారు.
మీ దేశ బడ్జెట్ మా సైనిక బడ్జెట్‌కు కూడా సమానం కాదని అన్నారు. హిందు- ముస్లింల మధ్య ఘర్షణలు సృష్టించడానికే పాకిస్తాన్, ఐఎస్ఐ, లష్కరే తోయిబా ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
కాగా, భారత్ లో రక్తం ప్రవహిస్తుంది, అని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పీపీపీ, చైర్మన్ బిలావల్ భుట్టో-జర్దారీ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కూడా ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు.
ముందు మీ తల్లిని ఉగ్రవాదులు చంపారు.. ఆ విషయం తెలుసుకుని మాట్లాడుతూ.. చిన్న పిల్లల్లాగా మాట్లాడ కూడదని సూచించారు. పాకిస్తాన్ పై మేము ఎలాంటి కుట్రలు చేయడం లేదు.. కానీ, వారు ఏదైనా చేస్తే, ప్రతిస్పందనకు సిద్ధంగా ఉండాలి అని హెచ్చరించారు.
రక్తం ప్రవహిస్తే, అది మన వైపు కంటే వారి వైపు ఎక్కువగా ప్రవహించే ఛాన్స్ ఉందని అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.
