TEJA NEWS

ఢిల్లీ చలో’ కు విరామం..

న్యూఢిల్లీ : కనీస మద్దతు ధర చట్టం, రుణమాఫీ తదితర రైతుల డిమాండ్లపై రైతు నేతలు, కేంద్ర మంత్రుల మధ్య జరిగిన నాలుగో దఫా చర్చలు ముగిశాయి. ముగ్గురు కేంద్ర మంత్రులు కమిటీ గతంలోనూ మూడుసార్లు రైతు సంఘాలతో చర్చించిన విషయం విదితమే. ఆదివారం రాత్రి 8 గంటల 15 నిముషాల నుండి సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట వరకు చర్చలు సాగాయి. ఈ చర్చల్లో కీలక ప్రతిపాదనను రైతు సంఘాల ముందు కేంద్రం ప్రకటించింది. ” ఫిబ్రవరి 19, 20 తేదీల్లో మా ఫోరమ్‌లలో చర్చించి దీనిపై నిపుణుల అభిప్రాయం తీసుకుని తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం ” అని రైతు నాయకుడు సర్వన్‌ సింగ్‌ పంధేర్‌ తెలిపారు.

మంత్రి పీయూష్‌ గోయెల్‌ మాట్లాడుతూ … రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధర కు కొనుగోలు చేస్తాయని తమ బృందం ప్రతిపాదించిందన్నారు. ఒప్పందం కుదిరాక ఐదేళ్ల పాటు ఇది అమలులో ఉంటుందని తెలిపారు. కందులు, మినుములు, మైసూర్‌ పప్పు, మొక్కజొన్న పండించే సాగుదారులతో ఎన్‌సీసీఎఫ్‌, ఎన్ఏఎఫ్ఈడీ వంటి సహకార సంఘాలు ఒప్పందం కుదుర్చుకుంటాయన్నారు. కొనుగోలు చేసే పరిమాణంపై ఎలాంటి పరిమితి ఉండబోదని… దీని కోసం ఒక పోర్టల్‌ కూడా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. ” కేంద్రాన్ని.. పప్పు ధాన్యాలపై కనీస మద్ధతు ధర హామీ అడిగాం” అని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌ మాన్‌ మీడియాకు తెలిపారు.

ప్రభుత్వ ప్రతిపాదనలపై రైతు నేత శర్వాన్‌ సింగ్‌ పంథేర్‌ మాట్లాడుతూ … నేడు, రేపు తమ రైతు సంఘాలతో చర్చిస్తామన్నారు. నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకొని ఒక నిర్ణయానికి వస్తామని అన్నారు. రుణమాఫీ వంటి డిమాండ్లు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. దీనిపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి ‘ఢిల్లీ చలో’ కార్యక్రమాన్ని నిలిపివేశామని.. ఒకవేళ తమ డిమాండ్లన్నింటికీ పరిష్కారం లభించకపోతే ఫిబ్రవరి 21న తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.


TEJA NEWS