TEJA NEWS

శాంతి, క్షమ, దయాగుణంతో జీవిస్తూ, పరులకు సాయపడటమే క్రీస్తుకు మనం ఇచ్చే నిజమైన కానుక : మాజీమంత్రి ప్రత్తిపాటి

  • కూటమిప్రభుత్వం పాస్టర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది : ప్రత్తిపాటి
  • గౌరవవేతనం విడుదలతో రాష్ట్రంలోని 8,400లకు పైగా పాస్టర్లకు లబ్ధి : ప్రత్తిపాటి.

సాక్షిత న్యూస్ చిలకలూరిపేట : పరమపవిత్ర దినమైన గుడ్ ఫ్రైడే నాడు ఏసుప్రభువు మనకోసం చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ, ఆయన చూపిన సన్మార్గంలో నడవాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. మనుషుల పాపాలను పోగోట్టి, వారికి నూతన జీవితాలను అందించేందుకు ఏసుప్రభువు తన జీవితాన్ని త్యాగం చేశాడని, ఆ ఫ్రభువుని వినమ్రతతో స్మరించుకుంటూ గుడ్ ఫ్రైడేను జరుపుతున్నారని ప్రత్తిపాటి తెలిపారు. ఏసు ఆశీస్సులతో శాంతి, క్షమ, మానవతా విలువలతో నిత్యం దయాగుణంతో జీవిస్తూ పరులకు సాయపడటమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన కానుక అనే విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. కొందరు అజ్ఞానులు,

అహంకారుల దుశ్చర్యతో శిలువనెక్కిన ఏసు, మూడోరోజున పునరుత్థానుడై తన భక్తుల్ని అనుగ్రహించాడని ఆ శుభదినాన్ని ఈస్టర్ గా జరుపుకుంటున్నామని ప్రత్తిపాటి తెలిపారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం పాస్టర్లకు గౌరవవేతనం విడుదల చేయడం సంతోషించాల్సిన విషయమన్నారు. పాదయాత్ర హామీని నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేశ్ పాస్టర్ల గౌరవవేతనం విడుదల చేయించి, క్ర్రీస్తు చూపిన బాటలో సర్వమానవ సంతోషాన్ని కాంక్షించాడని ప్రత్తిపాటి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 8,400లకు పైగా పాస్టర్లకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. 2024 మే నుంచి నవంబర్ వరకు 7 నెలల గౌరవవేతనాన్ని కూటమిప్రభుత్వం ఒకేసారి మంజూరు చేసిందన్నారు. దీనివల్ల ఒక్కో పాస్టర్ కు రూ.35వేలవరకు లబ్ధి కలుగుతుందని, అర్హులైన ప్రతి పాస్టర్ కు ఆ మొత్తం అందుతుందన్నారు. రాష్ట్రపురోగతి, ప్రజల శ్రేయస్సుకు కట్టుబడి కూటమిప్రభుత్వం అన్ని మతాలు.. వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుంటే, ఓర్వలేని వైసీపీ మత రాజకీయాలతో విద్వేషం సృష్టించేందుకు కుటిలచర్యలకు పాల్పడుతోందని ప్రత్తిపాటి అసహనం వ్యక్తం చేశారు.