Spread the love

ఫోన్‌ట్యాపింగ్ కేసు.. వంశీ కృష్ణ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురికి బెయిల్‌ మంజూరు అవడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరుశురాం విడుదలయ్యారు. పంజాగుట్టలో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై తెలంగాణ హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. జైలు నుంచి విడుదలైన వంశీ కృష్ణ మాట్లాడుతూ.. గతంలో మాజీ మంత్రి హరీష్‌రావు పేషీలో పనిచేశామని.. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు.

కేవలం మాజీ మంత్రి హరీష్ రావు పేరు చెప్పాలని తమను పోలీసులు ఇబ్బందులు గురి చేశారన్నారు. గతంలో హరీష్ రావు పేషీలో చేశానని అక్రమంగా ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. తమపై ఫిర్యాదు చేసిన చక్రధర్ గౌడ్ దగ్గర కూడా గతంలో తాను పనిచేసినట్లు తెలిపారు. చక్రధర్ గౌడ్ ఎన్ని మోసాలు చేశాడో తనకు తెలుసన్నారు. అవన్నీ కూడా ఎప్పుడు బయట పెట్టలేదని.. ఇప్పుడు అన్ని విషయాలు బయట పెడుతానని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసే అంత స్థాయి తమది కాదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాగైనా హరీష్ రావు పేరు చెప్పించాలని ఉద్దేశంతో తమను వేధింపులకు గురి చేశారని చెప్పారు. పోలీసుల వేధింపులపై ఇప్పటికే నాంపల్లి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశామని.. విచారణ పేరుతో గంటల తరబడి తమను వేధింపులు గురి చేశారని వాపోయారు. ‘‘హరీష్ రావు పేరు చెప్పకపోతే నీకు జీవితం ఉండదు, నీ ఉద్యోగం లేకుండా చేస్తామని డీసీపీ, ఏసీపీ బెదిరింపులకు దిగారు. నా కుటుంబ సభ్యులను డీసీపీ పరుష పదజాలంతో దూషించారు. పోలీసుల టార్గెట్ ఒకటే హరీష్ రావు పేరు మా నోట చెప్పించాలని ’’ అని చెప్పుకొచ్చారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుపై ఆధారాలు లేకపోవడంతో తమ ద్వారా ఆయన పేరు చెప్పించాలని పోలీసులు ప్రయత్నం చేశారన్నారు. తాము కిందిస్థాయి ఉద్యోగులమే అని స్పష్టం చేశారు. ఇక నుంచి చక్రధర గౌడ్ పైన, పోలీసులపైన న్యాయపోరాటం కొనసాగిస్తామని తెలిపారు. తమను టెర్రరిస్టుల్లాగా, దొంగల్లాగా పోలీసులు ట్రీట్ చేశారని వంశీ కృష్ణ పేర్కొన్నారు..