Andhra Pradesh: వైసీపీ సిట్టింగుల్లో టెన్షన్.. టెన్షన్.. మారుస్తున్నారన్న ప్రచారంతో పలు చోట్ల నిరసనలు.. రాజీనామాలు..!
నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై వైసీపీ అధిష్ఠానం కసరత్తు కొనసాగుతోంది. పలువురు ఎమ్మెల్యేలకు సైతం నో టికెట్ అంటోన్న సీఎం జగన్.. కొందరికి మరోచోట ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో ఈసారి టికెట్ దక్కుతుందో లేదోనని సిట్టింగుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
వైసీపీ అధిష్ఠానం ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. టికెట్ వస్తోందో రాదోనని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతుంటే.. నో టికెట్ సంకేతాలతో ఎమ్మెల్యేల అనుచరులు ఆందోళనకు దిగుతున్నారు. పలు చోట్ల రాజీనామాలకు కూడా సిద్ధమవుతున్నారు. నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై వైసీపీ అధిష్ఠానం కసరత్తు కొనసాగుతోంది. పలువురు ఎమ్మెల్యేలకు సైతం నో టికెట్ అంటోన్న సీఎం జగన్.. కొందరికి మరోచోట ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో ఈసారి టికెట్ దక్కుతుందో లేదోనని సిట్టింగుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి పిలిచిన వైసీపీ అధిష్ఠానం.. టికెట్‌పై స్పష్టత ఇచ్చింది.
మరోవైపు చింతలపూడి అభ్యర్థిని మారుస్తున్నారన్న ప్రచారంతో 100 కార్లతో తాడేపల్లికి చేరుకున్నారు చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా అనుచరులు. పశ్చిమగోదావరి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి ఇంటి దగ్గర ఎలిజా అనుచరులు ఆందోళన చేపట్టారు. ఎలిజాకే మరోసారి సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో ఎలిజా అనుచరులు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణకు మద్దతుగా వైసీపీ కార్యకర్తల ఆందోళన చేపట్టారు. శంకరనారాయణకే టికెట్ కేటాయించాలంటూ సోమందేపల్లి వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర కార్యకర్తలు బైఠాయించారు. మంత్రి ఉషశ్రీ చరణ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉషశ్రీ వద్దు… శంకరనారాయణ ముద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కళ్యాణదుర్గంలో ఉషశ్రీచరణ్‌కు టిక్కెట్ ఇవ్వట్లేదని.. అక్కడ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటుంటే.. పెనుకొండ టికెట్ ఉషశ్రీకి ఎలా ఇస్తారని ఎమ్మెల్యే శంకరనారాయణ వర్గం ప్రశ్నిస్తోంది.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోనూ వైసీపీ ప్రజాప్రతినిధుల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. గాండ్లపెంట మండలంలో పది మంది సర్పంచులు, నలుగురు ఎంపీటీసీలు, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జడ్పీటిసీలు రాజీనామా చేశారు. ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి సీటు రాదన్న ప్రచారంతో తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్‌పై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి టికెట్ ఇస్తేనే సహకరిస్తామని.. లేకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని ఎంపీపీ, జడ్పిటిసి సర్పంచులు హెచ్చరించారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఎన్నో పదవులు ఇచ్చి అందరికీ సమన్యాయం చేశారన్నారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వైసీపీ అధిష్ఠానం పలు నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను మారుస్తుండడంతో టికెట్ రాదన్న ప్రచారంతో ఎమ్మెల్యేల అనుచరులు నిరసనకు దిగుతున్నారు. ఈసారి కూడా టికెట్ కేటాయించాలని.. లేదంటే సహకరించమని వారు హెచ్చరిస్తున్నారు. మరి అధిష్ఠానం ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తుందో చూడాలి.