TEJA NEWS

ప్రజలకు మెరుగైన విద్యుత్తు సేవలు అందించండి

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలి

షాద్ నగర్ నియోజకవర్గ విద్యుత్ శాఖ సమీక్షా సమావేశం

షాద్ నగర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రజలకు ఇలాంటి విద్యుత్ అసౌకర్యాలు ఏర్పడకుండా ఎప్పటికప్పుడు సత్వర చర్యలు తీసుకోవాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశించారు. సోమవారం షాద్ నగర్ ప్రభుత్వ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ డీఈ శ్యాంసుందర్ రెడ్డి, షాద్ నగర్ ఏడి సత్యనారాయణ, కొత్తూరు ఏడి రవీందర్, ఏఈలు రమేష్ గౌడ్, శ్రీధర్, ఈశ్వర్, వినోద్, షణ్ముఖ రెడ్డి, రవికుమార్ తదితర సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఆరు మండలాలు ఆయా గ్రామాలలో విద్యుత్ సౌకర్యాలు సమంజసంగా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. విద్యుత్ మెటీరియల్ కొరత ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. వ్యవసాయానికి నాణ్యమైన కరెంటు అందించాలని రాయబోయే వ్యవసాయ సీజన్ లో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని సరిచేయాలని కోరారు.

ముఖ్యంగా లో వోల్టేజ్ సమస్య ఉంటే దానిని అధిగమించాలని తెలిపారు. పట్టణాలు పల్లెలు ఏ ప్రాంతాల్లోనైనా విద్యుత్తు కొరత లేకుండా చూడాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో విద్యుత్ శాఖలో 136 మంది సిబ్బంది అవసరం ఉందని అయితే 52 మంది మాత్రమే సిబ్బంది ఉన్నారని మిగతా స్థానాల్లో సిబ్బంది భర్తీకు కృషి చేయాలని విద్యుత్ అధికారులు ఎమ్మెల్యే శంకర్ దృష్టికి తెచ్చారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సులోచన కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ తదితరులు పాల్గొన్నారు..


TEJA NEWS