TEJA NEWS

ప్రజా సమస్యలు, నగరంలో చేపట్టవలసిన అభివృద్ధి పనుల పై GHMC సమావేశంలో ముక్తకంఠంతో ప్రశ్నించాలని BRS పార్టీ MLA లు, MLC, కార్పొరేటర్ లతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. 6 వ తేదీన GHMC కౌన్సిల్ సమావేశం జరగనున్న నేపథ్యంలో తెలంగాణ భవన్ లో GHMC పరిధిలోని MLA లు, MLC కార్పొరేటర్ ల సమావేశం లో కౌన్సిల్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు MLA లు, కార్పొరేటర్ లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 7 నెలలు దాటినా నేటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటినా ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహిళలకు 2500 వేల ఆర్ధిక సహాయం, 4 వేల రూపాయలకు పెన్షన్ పెంపు, కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం పంపిణీ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంత వరకు అమలుకు నోచుకోకపోవడం పైనే ప్రధానంగా చర్చించారు. గత BRS ప్రభుత్వం మంజూరు చేసిన అనేక అభివృద్ధి పనులను ఈ ప్రభుత్వం రద్దు చేసిందని, ఇది సరైన విధానం కాదని సమావేశంలో పేర్కొన్నారు. పారిశుద్ధ్యం నిర్వహణ కూడా సక్రమంగా లేదని, ఎక్కడికక్కడ చెత్త కుప్పలు పేరుకుపోయి ఉన్నాయని, ప్రజలు రోగాలభారిన పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలాలలో పూడిక తొలగింపు పనులు కూడా చేపట్టలేదని అన్నారు. తమను గెలిపించిన ప్రజల పక్షాన ఈ అంశాలు అన్నింటి పై GHMC కౌన్సిల్ సమావేశంలో ప్రశ్నించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో MLC సురభి వాణిదేవి, MLA లు పద్మారావు గౌడ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్ సుధీర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాలేరు వెంకటేష్, మాజీమంత్రి మహమూద్ అలీ, కార్పొరేటర్ లు పాల్గొన్నారు.


TEJA NEWS