వసతి గృహాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు మెస్స్ చార్జీలు పెంపు ………………………… అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ……..
వనపర్తి
సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకే ప్రభుత్వం మెస్ చార్జీలను 40% పెంచిందని, కాబట్టి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే దిశగా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్ ఆదేశించారు.
కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత శాఖల జిల్లా అధికారులతో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు తలెత్తకూడదనే మెస్ చార్జీలను 40% ప్రభుత్వం పెంచిందన్నారు. కాబట్టి ఫుడ్ పాయిజన్ జరగకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులు, వార్డెన్లపై ఉందన్నారు. ముడి సరుకులు నిల్వ చేసే స్టోర్ రూమ్లు పరిశుభ్రంగా ఉంచాలని, వంట పాత్రల శుభ్రత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నాణ్యమైన సన్న బియ్యం, తాజా కూరగాయలతో మెనూ సిద్ధం చేయాలన్నారు. పప్పులు, ఇతర దినుసుల నాణ్యతను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. ఆర్వో ప్లాంట్ల పనితీరును పరిశీలించాలని, సురక్షిత తాగునీరు అందించాలని సూచించారు. వారానికి కనీసం మూడుసార్లు వసతి గృహాలను పరిశీలించాలని స్పష్టం చేశారు. నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సమావేశంలో అన్ని సంక్షేమ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.